ఐటీడీఏ.. గాడిన పడేనా? | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ.. గాడిన పడేనా?

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

ఐటీడీఏ.. గాడిన పడేనా?

వైశాలి మార్కు చూపేనా?

సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏలకు దాదాపు రెండేళ్లుగా రెగ్యులర్‌ పీఓలు లేరు. ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నాయి. దీంతో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. కొంతకాలంగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సైతం నిర్వహించిన దాఖలాలు లేవు. గిరిజన సంక్షేమం, సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. అధికారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గిరిజన సంక్షేమం కోసం వినియోగించాల్సిన ఐటీడీఏ నిధులు.. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినా పట్టించుకునే నాథుడే లేడు.

గిరి వెలుగులో లక్షలాది రూపాయలు దుర్వినియోగం జరిగినా సంబంధిత అధికారులపై చర్యలు శూన్యం. ఐటీడీఏ పరిధిలో విద్యార్థుల మరణాలు, డోలీ మోతలు, తాగునీటి సమస్యలు, మెనూ పాటించకపోవడం వంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ రెండేళ్లలో కొంతమంది పాలకులు, అధికారులు ఐటీడీఏను ఆదాయ వనరుగా వినియోగించుకుంటున్నారే తప్ప.. గిరిజన సంక్షేమం కోసం దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మూడు నెలలకు ఒక సారి జరగాల్సిన పాలక వర్గ సమావేశం పత్తాలేకుండా పోయింది. పాలకవర్గ సమావేశం నిర్వహిస్తే నిలదీతలు తప్పవేమో అన్న భయం ప్రజాప్రతినిధులను వెంటాడుతోందని గిరిజన సంఘాల నాయకులు అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో, గ్రామాల్లో పర్యటన, పరిశీలన చేసి సమస్యలు పరిష్కరించాల్సి ఉన్నా.. ఆ దిశగా ఎవరూ ముందుకు రావడం లేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు నివారణ కోసం ఏఎన్‌ఎం నియామకాల ఊసు లేదు.

సబ్‌లెక్టర్‌ ఆర్‌.వైశాలిని పార్వతీపురం ఐటీడీఏ రెగ్యులర్‌ పీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా ఆమె పనితీరు పట్ల సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఆమె కఠినంగా వ్యవహరించారు. అర్ధరాత్రి వేళ తనిఖీలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. పీఓ పోస్టుకు వైశాలి న్యాయం చేస్తారన్న నమ్మకంతో గిరిజన సంఘాలు ఉన్నాయి. అందుకనుగుణంగానే విధుల్లో చేరిన వెంటనే తన మార్కు చూపించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులు, పీఈటీలకు ‘అప్‌గ్రేడ్‌’ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను మొదటి గ్రీవెన్స్‌లోనే పరిష్కారం చూపారు. మిగిలిన అంశాలపైనా ఆమె దృష్టి సారించి ఐటీడీఏను గాడిలో పెట్టాలని గిరిజనులు కోరుతున్నారు. కొద్ది నెలల్లో పీఓ వైశాలి వ్యక్తిగత కారణాల రీత్యా దీర్ఘకాలిక సెలవు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో మళ్లీ ఇన్‌చార్జి పాలన తప్పకపోవచ్చు. మరోవైపు.. సీతంపేట ఐటీడీఏకు రెగ్యులర్‌ పీఓను నియమించాల్సిన అవసరం ఉంది.

దాదాపు రెండేళ్ల తర్వాత పార్వతీపురం ఐటీడీఏకు రెగ్యులర్‌ పీఓ

కొత్త పీఓ ‘వైశాలి మార్కు’ చూపిస్తారని ఆశాభావం

సీతంపేట.. ఇంకా ఇన్‌చార్జి అధికారి పాలనలోనే..

Advertisement
 
Advertisement
Advertisement