మెగా కోలాటానికి అవాంతరం ఎందుకు?
ఊరంతా ప్రచారం, రోజుల తరబడి
శిక్షణ వృథానేనా?
పార్వతీపురంలో జోరందుకున్న చర్చ
సాక్షి, పార్వతీపురం మన్యం:
జిల్లా కేంద్రంలో 6 వేల మంది విద్యార్థులతో ఈ నెల 22న మెగా కోలాటం నిర్వహించ తలపెట్టి న విషయం విదితమే. ఊరంతా ప్రచారం చేసి, అంతా సిద్ధమై.. చివరి గంటల్లో కార్యక్రమం రద్దు కావ డం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ వర్గాల్లో చర్చగా మిగిలింది. ఎండల వల్ల కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా.. అది వాస్తవం కాదని, దీని వెనుక ఒక ప్రజా ప్రతినిధి ‘అహం’అడ్డు పడిందన్న వాదన వినిపిస్తోంది. తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. తన ప్రమేయం లేకుండా అధికారులు కార్యక్రమాన్ని చేసుకుని వెళ్లిపోతుండడం నచ్చకనే ఇదంతా చేశారని సమాచారం.
కలెక్టర్ ప్రభాకర రెడ్డి మెగా కోలాటాన్ని ప్రతిష్టా త్మకంగా తీసుకున్నారు. పండగ వాతావరణంలో నిర్వహించాలని భావించారు. లిమ్కాబుక్‌లో మ న్యం జిల్లాకు స్థానం తెచ్చి పెట్టాలని కలలుగన్నా రు. అందుకోసం తీవ్రంగా శ్రమించారు. ఆరు వేల మంది పిల్లలను సంసిద్ధులను చేశారు. రోజుల తరబడి వారికి కోలాటంలో శిక్షణ ఇప్పించారు. కొన్ని రోజులుగా ఉపాధ్యాయులు, వివిధ విభాగాల సిబ్బంది ఇదే పనిలో ఉన్నారు. హోర్డింగులతో విస్తృత ప్రచారం కల్పించారు. ఆ రోజున విద్యార్థులను తరలించేందుకు బస్సులను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు సజావుగా నృత్యం చేసేలా రహదారులపై మార్కింగ్ కూడా చేశారు. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అయిపోయాయి. ఆ ప్రజా ప్రతినిధి పంతం ముందు.. ఆ కష్టం, ఈ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. వాస్తవానికి కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగానే ఉంది. మున్ముందు మరింతగా పెరగవచ్చని వాతావరణశాఖ హెచ్చరిస్తూనే ఉంది. ఎండలతో కార్యక్రమం చేపడితే ఇబ్బందులు ఎదురుకావచ్చని ముందుగానే యంత్రాంగం కార్యక్రమాన్ని రద్దు చేయవచ్చు గాక! నిజంగా వాయిదా వేయాలని అనుకుంటే.. ముందురోజు వరకూ తెచ్చి ఉండక్కర్లేదు. భారీ తుఫాన్లు, వర్షాల సమయంలోనే అకస్మాత్తుగా కార్యక్రమాలు రద్దు చేస్తారు. అంతకుమించి అవాంతరం ఆ ప్రజాప్రతినిధి నుంచి వచ్చిందని ఉద్యోగ వర్గాల్లో చర్చసాగుతోంది. ఒక రికార్డు కోసం ఇటు అధికారులతో పాటు.. అటు పిల్లలు, వారి తల్లిదండ్రులు ఎంతో కలలుగన్నారు. ఆరు వేల మంది కలలను కాలరాసిన ఓ నిర్ణయం... క్షమించరాని మచ్చగా మిగిలిపోతుందని తల్లిదండ్రులు అంటున్నారు.


