పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన అర్జీదారులు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన అర్జీదారులు

Feb 3 2026 7:47 AM | Updated on Feb 3 2026 7:47 AM

పీజీఆ

పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన అర్జీదారులు

380 వినతుల స్వీకరణ

వినతులు సకాలంలో పరిష్కరించాలి

జేసీ సేతు మాధవన్‌

విజయనగరం అర్బన్‌: ప్రజల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’(పీజీఆర్‌ఎస్‌), ‘రెవెన్యూ క్లినిక్‌’ కార్యక్రమాలకు భారీ స్పందన లభించినప్పటికీ, రెవెన్యూ శాఖ వైఫల్యాలు మరింత స్పష్టంగా బయటపడ్డాయి. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ ఫిర్యాదులు, వినతులు సమర్పించారు. కలెక్టరేట్‌ ప్రాంగణం అంతా అర్జీదారులతో కిటకిటలాడింది. ఇది ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి, సమస్యల పరిష్కారంలో జాప్యం ఎంత తీవ్రంగా ఉన్నాయో సూచిస్తోంది. మొత్తం 380 వినతులు అందగా వాటిలో అత్యధికంగా దాదాపు 50 శాతం 188 వినతులు రెవెన్యూశాఖకు సంబంధించినవే ఉన్నాయి. భూముల మ్యుటేషన్లు, అడంగల్‌, వన్‌–బీ సర్టిఫికెట్లు, పట్టాదార్‌ పాస్‌బుక్‌లు, భూమి రికార్డుల సరిదిద్దులు వంటి సాధారణ రెవెన్యూ సమస్యలే ఈ వినతుల్లో ఎక్కువ భాగం ఆక్రమించాయి. మరో వైపు వాటిలో రీఓపెన్‌ వినతులు కూడా అధికంగానే ఉన్నాయి. అదేవిధంగా ఐటీ పార్కులు, పరిశ్రమలు అంటూ ఇష్టాను సారం భారీ విస్తీర్ణంలో భూముల సేకరణను వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి వినతులున్నాయి. ఈ పరిస్థితి రెవెన్యూ విభాగంలోని పనితీరు, సమస్యల పరిష్కార వేగంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని స్పష్టం చేస్తోంది.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆలస్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

అన్ని శాఖలు ఈపీటీఎస్‌ పద్ధతిలో తమ రికార్డులు, ప్రొసీడింగ్స్‌, సర్క్యులర్లు, కోర్టు తీర్పులు, నోటీఫికేషన్లు, ప్రగతి సమాచారం వంటివి ప్రతిరోజూ తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలని శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వినతులు కూడా గణనీయంగా ఉన్నాయని, గ్రామ సచివాలయ శాఖకు 53, డీఆర్‌డీఏకు 48, పంచాయితీరాజ్‌కు 25 వినతులు అందాయి. 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా వచ్చిన కాల్స్‌పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అర్జీదారులతో నేరుగా మాట్లాడిన తర్వాతే ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలని మాట్లాడిన తేదీ, సమయం రిపోర్టులో నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వినతులు స్వీకరణ ప్రక్రియలో డీఆర్‌ఓ ఈ.మురళి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, శాంతి, ఆర్‌డీఓలు దాట్ల కీర్తి, సత్యవాణి, రామ్మోహనరావు, సీసీఓ పీ.బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన అర్జీదారులు1
1/1

పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిన అర్జీదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement