సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి
పార్వతీపురం రూరల్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్జీదారులు సంతృప్తి చెందేలా శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పీజీఆర్‌ఎస్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండకూడదని, గడువు ముగియక ముందే సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఒకవేళ వినతులను తిరస్కరించాల్సి వస్తే, అందుకు గల సరైన కారణాలను బాధితులకు లిఖితపూర్వక సమాచారం ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 143 దరఖాస్తులు అందగా, అందులో 91 రెవెన్యూ విభాగానికి చెందినవి కాగా, 52 సాధారణ దరఖాస్తులు ఉన్నాయి. వీరఘట్టం మండలం కూరాకుల వీధి అంగనన్‌వాడీ కేంద్రంలో విధులకు ఆటంకం, మెనూ అమలులో వైఫల్యంపై బాలింతలు ఫిర్యాదు చేయగా..కురుపాం గ్రీన్ అంబాసిడర్లు తమ 11 నెలల బకాయి వేతనాల కోసం విన్నవించుకున్నారు. ఉపాధి అవకాశాలు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు, లోన్ల మంజూరుతో పాటు తోటపల్లి బ్యారేజీ నిర్వాసితుల నష్టపరిహారం, భూ ఆక్రమణలు, రీ–సర్వేలో తప్పుల సవరణపై పలువురు కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బాధితులకు భరోసా..సమస్యలకు పరిష్కారం
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ బాధితులకు కొండంత అండగా నిలిచింది. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్వయంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, వేధింపులు, అలాగే ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి మొత్తం 16 ఫిర్యాదులు అందాయి. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ..అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదుల పూర్వాపరాలను ఆరా తీసి, బాధితులకు చట్ట పరిధిలో తక్షణమే న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ గోడును నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు వివరించేందుకు ఈ వేదిక ఒక చక్కని అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం


