కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ లక్ష్యం
● వైద్యారోగ్యశాఖ మంత్రి
సత్యకుమార్ యాదవ్
శృంగవరపుకోట: రాష్ట్రంలో మూత్రపిండ వ్యాధి గ్రస్థులకు ఉచిత డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎస్.కోటలో 100పడకల ప్రభుత్వాస్పత్రి అదనపు భవనాలను, డయాలసిస్ కేంద్రాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లలితకుమారిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డయాలసిస్ రోగులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందివ్వడం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సీహెచ్‌సీలో పూర్తిస్థాయి వైద్యం అందివ్వాలని ఆరు నెలల్లో పెండింగ్ పనులు పూర్తి చేసి మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం పనిచేసిందన్నారు. మెరుగైన ఆరోగ్యసేవలు ఇవ్వాలని ఎన్‌సీడీ హెల్త్ కాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ తన అభ్యర్థనను మన్నించిన ఆరోగ్యశాఖ మంత్రి ఆస్పత్రి పూర్తికావడానికి సహకారం అందించారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, ఆర్డీవో కీర్తి, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, జనసేన ఇన్‌చార్జ్ ఒబ్బిన సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ సీహెచ్.మల్లునాయుడు, బీజేపీ నేత రాకేష్ వర్మ, రెడ్డి పావని, డోకుల అచ్చింనాయుడు, కె.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ జీఎస్.నాయుడు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.శ్రీలక్ష్మి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్లు ఎన్.రమణాజీ, జి.బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.


