ఉద్యోగం ఆశచూపి ఉచ్చులోకి లాగి..! | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఆశచూపి ఉచ్చులోకి లాగి..!

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

ఉద్యో

ఉద్యోగం ఆశచూపి ఉచ్చులోకి లాగి..!

ఉద్యోగం ఆశచూపి ఉచ్చులోకి లాగి..!

● నిరుద్యోగులే లక్ష్యంగా సైబర్‌ మోసగాళ్ల వల

ఉమ్మడి జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్న నకిలీ నియామకాల మాయాజాలం

గతేడాది 15 కేసులు నమోదు

పార్వతీపురం రూరల్‌: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను ఎరగా వేసి సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మాయాజాలానికి తెరలేపారు. రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుడి నుంచి, ఉన్నత చదువులు చదివి కొలువు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న యువత వరకు అందరినీ ఈ ’డిజిటల్‌ దగా’ నిలువునా ముంచేస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రస్తుతం ఈ సైబర్‌ మోసాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అడ్డదారుల్లో సొమ్ము చేసుకునే ముఠాలు సోషల్‌ మీడియా వేదికగా మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి.

కలల కొలువు..కన్నీళ్ల బతుకు

కురుపాం మండలానికి చెందిన ఓ యువకుడి కథ వింటే సైబర్‌ నేరగాళ్ల బరితెగింపు అర్థమవుతుంది. సూపర్‌వైజర్‌ ఉద్యోగమంటూ నమ్మబలికిన ఓ మోసగాడు, ఏకంగా లక్ష రూపాయలతో పాటు పదో తరగతి, ఇంటర్‌ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను గుంజేసుకున్నాడు. తీరా ఉద్యోగం ఏదని నిలదీస్తే..ఎదురు తిరిగి పోలీసు కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగడం గమనార్హం. ఇది ఒక్క కురుపాం బాధితుడి వ్యధే కాదు, విజయనగరం జిల్లాకు చెందిన మరో ముగ్గురు యువకుల పరిస్థితి మరీ దారుణం. ఇన్‌స్ట్రాగామ్‌ ప్రకటన చూసి మురిసిపోయిన వారిని మయన్మార్‌ దాటించి, అక్కడ బందీలుగా మార్చి, చిత్రహింసలు పెట్టి బలవంతంగా సైబర్‌ నేరాలు చేయించడం సభ్యసమాజాన్ని విస్తుపోయేలా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో వారు ఎలాగోలా స్వదేశం చేరడంతో ఆ ముఠా క్రూరత్వం వెలుగులోకి వచ్చింది.

వర్క్‌ ఫ్రం హోమంటూ వంచన

‘ఇంటి నుంచే పని..హోటళ్లకు రేటింగ్‌ ఇస్తే చాలు కమీషన్ల వర్షం‘ అంటూ వచ్చే ప్రకటనలు నిరుద్యోగులను ఉచ్చులోకి లాగుతున్నాయి. విజయనగరం గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి తొలుత రూ.5 వేలు ఇచ్చి ఎర వేసిన నేరగాళ్లు, క్రమక్రమంగా అతడి నుంచి రూ.1.82 లక్షలు కాజేయడం గమనార్హం. లాభాలు ఆశ చూపడం, ఆపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టించి చేతులు ఎత్తేయడం వారి నైజం. వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా సంప్రదించి, నకిలీ యాప్‌ లింకులు పంపి సెల్‌ ఫోన్లలోని రహస్య సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.

రాష్ట్రాలు దాటిస్తున్న

రాక్షస వ్యూహం

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి యువతను జార్ఖండ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ రహస్య స్థావరాల్లో వారిని ఉంచి, స్థానిక భాషలు తెలిసిన వారితోనే ఇతరులకు ఫోన్‌ చేయించి బురిడీ కొట్టిస్తున్నారు. యూపీఐ ఖాతాల ద్వారా నగదు మళ్లింపులు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట మహిళలను మోసగించడం ఇప్పుడు నిత్యకృత్యమైంది. కేవలం ఉద్యోగాలే కాకుండా, ఆస్తి పత్రాలు తాకట్టు పెడితే రుణాలు ఇస్తామని, పార్సిల్‌ ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయాలంటూ ఓటీపీలు అడిగి ఖాతాలు ఖాళీ చేసే ’కొరియర్‌ మోసాలు’ కూడా పెచ్చుమీరుతున్నాయి. గతేడాది ఉమ్మడి జిల్లాలోనే ఉద్యోగాల పేరిట 15 ప్రధాన కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం బయటపడిన గణాంకాలు మాత్రమే. పరువు పోతుందనో, భయపడో ఫిర్యాదు చేయని బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల ఆవేదనను నగదుగా మార్చుకుంటున్న ఈ సైబర్‌ రాబందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు సర్టిఫికెట్లు, నగదు, ఓటీపీలు ఇచ్చి ’బలి’ కావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Fake JOB Offers

నకిలీ యాప్‌లు, మాయా లింకులతో మీ బ్యాంకు ఖాతాలనే కాకుండా, మీ వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తున్న సైబర్‌ నయవంచకుల పట్ల అవగాహనపరమైన జాగ్రత్తలతో ఉండాలి. తెలియని వ్యక్తులకు ఓటీపీలు వంటివి చెప్పకూడదు . ఏదైనా అనుమానం వస్తే వెనుకాడకుండా వెంటనే 1930కు సమాచారం అందించండి. ఎస్పీ ఎస్వీ మాధవ్‌ రెడ్డి,

పార్వతీపురం

మన్యం

జాగ్రత్తగా ఉండాలి

ఉద్యోగం ఆశచూపి ఉచ్చులోకి లాగి..!1
1/2

ఉద్యోగం ఆశచూపి ఉచ్చులోకి లాగి..!

ఉద్యోగం ఆశచూపి ఉచ్చులోకి లాగి..!2
2/2

ఉద్యోగం ఆశచూపి ఉచ్చులోకి లాగి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement