రీ సర్వే సవరణలో తప్పని తిప్పలు | - | Sakshi
Sakshi News home page

రీ సర్వే సవరణలో తప్పని తిప్పలు

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

రీ సర్వే సవరణలో తప్పని తిప్పలు

రీ సర్వే సవరణలో తప్పని తిప్పలు

రీ సర్వే సవరణలో తప్పని తిప్పలు

విజయనగరం అర్బన్‌: కూటమి ప్రభుత్వం ‘రీసర్వే 2.0’ కార్యక్రమంగా గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ జిల్లాలో ఆ ప్రక్రియ వైఫల్యం చెందింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ అవుతున్న పట్టాదారు పాస్‌పుస్తకాల్లోని తప్పులను సవరణ చేయించుకోవడంలో తిప్పలు తప్పడం లేదు. రైతుల పేర్లు, తండ్రుల పేర్లు, సర్వే నంబర్లు, భూవిస్తీర్ణం, ఎల్పీఎంలు ఇలా అన్నీ తప్పులతో కూడిన పాస్‌పుస్తకాలు 50 శాతానికి పైగా ఉన్నాయి. నిజానికి ఈ తప్పులు కేవలం క్షేత్రస్థాయి అజాగ్రత్తతో వచ్చినవి కావని ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం క్రమబద్ధమైన నిర్లక్ష్యం, అసమర్థత, బాధ్యతారాహిత్యం వల్ల జరిగినట్లు తెలుస్తోంది. వాటిలో 50 శాతానికి పైగా వ్యక్తిగత వివరాల్లో అధిక తప్పులున్నాయని అధికారులే ఒప్పుకున్నారు. దీంతో వాటి సవరణ కోసం రైతులు సచివాలయాలు, మీసేవ కేంద్రాల ముందు గంటల తరబడి నిలబడి, డాక్యుమెంట్లతో తిరుగుతున్నారు. ఇది రీ సర్వే సవరణ కాడు రైతుల జీవితాలపై జరిగిన క్రమబద్ధమైన ద్రోహమని వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన 2,26,009 మంది రైతులకు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 423 గ్రామాల్లో 1,89,343 మందికి మాత్రమే అందజేశారు. ఇంకా 37 వేలు పంపిణీకి పెండింగ్‌లోనే ఉన్నాయి. సొంతంగా తీసుకున్నవి కేవలం 85,102 మాత్రమే. మిగిలినవి కుటుంబ సభ్యుల ద్వారా అంటే చాలామంది రైతులు ఇంకా తమ పాస్‌పుస్తకాలు చూడలేదు. చూసినవారు పుస్తకాల్లో ఉన్న తప్పులు గుర్తించి షాక్‌కు గురవుతున్నారు.

తప్పుల సవరణకు జేసీ అనుమతి

తప్పులు సరిచేయడానికి ఆరు కేటగిరీలు పెట్టి, తహసీల్దార్‌ లాగిన్‌, ఆర్డీవో అనుమతి, జేసీ అప్రూవల్‌, సచివాలయంలో అర్జీలు, డాక్యుమెంట్ల పరిశీలన ఇలా ప్రతి చోటా బ్యూరోక్రాటిక్‌ జల్లెడ పెట్టే పరిస్థితులు ఉంటాయి. పాత సర్వే నంబర్లకు కొత్త ఎల్పీఎం కొర్లేషన్‌ సరిగా జరగలేదు. భూములు అమ్ముకున్నా వారసులు మారినా ఇప్పటికీ ముత్తాతల పేర్లే ఉన్నాయి. ప్రభుత్వ భూముల కేటగిరీలో తప్పలు సరిచేయడానికి జేసీ అనుమతి అవసరమని చెప్పడం ఇది ఎంత పెద్ద అసంబద్ధత? అదే విధంగా మ్యుటేషన్లకు సచివాలయాల్లో అర్జీలు, కరెక్షన్స్‌కు తహసీల్దార్‌కు దరఖాస్తు, ఆ తర్వాత ఆర్డీవో దగ్గరకు నెలల తరబడి తిరగాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ వరకు పంపిణీ చేస్తామని గ్రామసభల్లో ఈ కేవైసీ తీసుకుని ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం. ఎంపిక చేసిన 12 గ్రామాల్లో తప్పులు సరిచేసి ఫిబ్రవరిలో పంపిణీ చేస్తామని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కేవలం 3,896 పాస్‌పుస్తకాలు మాత్రమే సరిచేశారు. మొత్తం 2.26 లక్షల్లో ఇది ఏమాత్రం కాదు. జిల్లా రెవెన్యూ అధికారి ఈ.మురళి చెప్పిన వివరాలు ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో బట్టబయలు చేస్తున్నాయి.

ఈ రీసర్వే వైఫల్యం వల్ల రైతులు బ్యాంకు రుణాలు పొందలేక, రాయితీలు రాకుండా భూములు అమ్మలేక, కోర్టు కేసుల్లో చిక్కుకుంటున్నారు. భూమి వివాదాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇది అభివృద్ధి కాదు రైతుల జీవితాలను నాశనం చేసే క్రమబద్దమైన దుర్మార్గం. ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు బాధ్యత తీసుకోకపోతే విజయనగరం జిల్లా రైతులు మరింత దారిద్య్రంలోకి జారిపోతారు. ఇవి కేవలం తప్పులుకాదు తమ పట్ల జరిగిన ద్రోహంగా రైతులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement