ప్రభుత్వ బడులను కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

● ఉత్తరాంధ్ర వర్క్‌షాప్‌లో యూటీఎఫ్‌ పిలుపు

విజయనగరం అర్బన్‌: ప్రభుత్వ బడులను కాపాడుకుందామని యూటీఎఫ్‌ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల నాయకత్వంతో స్థానిక ఏపీఎన్‌జీఓ కార్యాలయంలోలో ‘ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం’ అనే అంశంపై ఆదివారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో పలువురు పేర్కొన్నారు. వర్క్‌షాప్‌ను ప్రారంభించిన యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించి ఊరిబడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడులను రక్షించుకోవడం కోసం ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు, ప్రజల సహకారం తప్పనిసరి అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించేందుకు ముందుకు రావాలని ఆ దిశగా యూటీఎఫ్‌ ఉద్యమం చేయల్సిన అవసరం ఉందన్నారు. విద్య లక్ష్యం సమాజంలోని వనరులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు సుభవంతమైన జీవితం అందించడమేనన్నారు. సమాజంలో ఇంకా ఉన్న అంటరానితనం, అసమానతలను తొలగించి సమానత్వ భావనను పెంపొందించడమే విద్య ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రశ్నలు లేని, పరిశోధనలేని విద్యా విధానం అమలవుతుండడం ఆందోళనకరమని, దీనికి ప్రత్యామ్నాయంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే విద్యా విధానం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఉపాధ్యాయులపై బాధ్యత

ప్రభుత్వ వ్యయంతో విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయులుగా మారిన మనం అదే సమాజం కోసం పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. పిల్లలు లేకుండా ఉపాధ్యాయ వృత్తి ఉండదని విద్యార్థులే కేంద్రంగా అన్ని కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలపై ఆరు జిల్లాల నాయకత్వం చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది. అనంతరం ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌.కిషోర్‌కుమార్‌, ఎస్‌.మురళీమోహన్‌, వి.శ్రీలక్ష్మి, సీనియర్‌ నాయకులు డి.రాము, నాగమణి, చౌదరి రవీంద్రతో పాటు ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల యూటీఎఫ్‌ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement