ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ కేసులో ఆరుగురు అరెస్టు
టెక్కలి రూరల్: ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు చోరీకి పాల్పడిన ఆరుగురిని కోటబొమ్మాళి పోలీసులు అరెస్టు చేసినట్లు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. ఆదివారం కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎం.రాము, మారేడుపాలెం గ్రామానికి చెందిన ఎం.నాగరాజు, పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన ఎన్.మోహన్‌రావు, పి.శ్రీను, ఎం.శ్రీనివాస్, ఎన్.రఘుబాబులు స్నేహితులు. వీరంతా మద్యానికి బానిసయ్యారు. ఎం.రాము తనకు ఎలక్ట్రికల్ వర్క్ తెలుసని, ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ వైర్లు చోరీ చేసి అమ్మితే బాగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో అందరూ కలిసి చోరీ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో 2023 నుంచి లావేరు, జలుమూరు, టెక్కలి, నందిగాం, ఎచ్చెర్ల, కవిటి, జె.ఆర్.పురం, మందస, పాతపట్నం, కోటబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాల్లో శివారున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యం చేసుకున్నారు. పక్కా ప్లాన్‌తో రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడే వారు. దీనిలో భాగంగా ఆదివారం సైతం ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రెక్కీ చేసేందుకు రాగా వారిపై అనుమానంతో కోటబొమ్మాళి పోలీసులు జర్జంగి జంక్షన్ వద్ద పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.8లక్షల15వేల100 విలువైన 607 కేజీల కాపర్ వైర్, 20 కేజీల అల్యూమినియం వైర్లు, ఆటో, బైక్, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.


