దౌర్జన్య పాలనకు స్వస్తి పలకాలి..
జియ్యమ్మవలస రూరల్: తిరుపతి శ్రీనివాసునితో ఆడుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు పార్టీ కార్యాలయం విధ్వంసాలకు పాల్పడ్డ చర్యలకు నిరసనగా ఆదివారం చినమేరంగి పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించేందుకు ప్రయత్నించగా చినమేరంగి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీవీ తిరుపతిరావు ఆధ్వర్యంలో జియ్యమ్మవలస, చినమేరంగి ఎస్సై, పోలీసు సిబ్బందితో ముట్టడించి నిరసన కార్యక్రమాన్ని కనీసం గ్రామంలోకి రాకుండా నిర్బంధించారు. ఈ సందర్భంగా పరీక్షిత్ రాజు మాట్లాడుతూ..తిరుపతి లడ్డూ అంశంపై కోర్టు తీర్పు ఇచ్చినా ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయకుండా వైఎస్సార్‌సీపీపై ఈ పాపాన్ని అపాదించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండగా అంబటి రాంబాబు దీన్ని వ్యతిరేకించినందుకు ఆయనపై టీడీపీ మహిళా కార్యకర్తలతో దుర్భాషలాడించి పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసి రాక్షస పాలన చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, నాయకులను అక్రమ అరెస్టులు చేసి ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆరోపించారు. అనంతరం కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసనలు తెలిపి చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.


