రూ.450 కోట్లతో 15 రైల్వేస్టేషన్ల అభివృద్ధి
● పర్లాకిమిడి రైల్వేస్టేషన్ త్వరలో ప్రారంభం
● వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎం లలిత్‌బోహ్రా
కొత్తవలస: అమృత్‌భారత్ పథకంలో భాగంగా వాల్తేరు డివిజన్‌లో రూ.450 కోట్లతో 15 రైల్వేస్టేషన్‌లను ఆధునికీకరించనున్నట్లు డీఆర్‌ఎం లలిత్‌బోహ్రా తెలిపారు. ఈ మేరకు కొత్తవలస రైల్వేస్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న అమృత్‌భారత్ పనులు, రైల్వేట్రాక్ వెల్డింగ్ పనులను ఆయన రైల్వే అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నిర్వహణపై అధికారులకు తగు చూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత్‌భారత్ పథకంలో పూర్తిస్థాయిలో ఆధునికీకరణ చేసిన పర్లాకిమిడి రైల్వేస్టేషన్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే మార్చి నెలాఖరుకు మరో నాలుగు స్టేషన్‌లు, జూన్ చివరి నాటికి కొత్తవలస రైల్వేస్టేషన్‌లో పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే 2047 నాటికి దేశంలోనే పూర్తిస్థాయిలో వందేభారత్ రైళ్లు నడిపేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు.


