మత సామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవం
విజయనగరం టౌన్: స్థానిక బాబామెట్టలో ఉన్న హజరత్ ఖాదర్‌వలీబాబా 67వ సుగంధ మహోత్సవాలు మూడో రోజు శనివారం అంగరంగ వైభవంగా ముగిశాయి. కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు. దర్గా, దర్బార్ ముతవల్లి డాక్టర్ ఖలీలుల్లా షరీప్ దర్బార్ సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఉరుసు సందర్భంగా బాబా సన్నిధిలో ఏర్పాటు చేసిన పరమ పవిత్ర అన్న సమారాధనను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబా సన్నిధిలో నిత్య అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆకలితో వచ్చే వారికి ఇక్కడ నిరంతరం భోజనం లభించడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇటువంటి ఉత్సవాలు సమాజంలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో దర్గా ముతవల్లి డాక్టర్ ఖలీల్‌బాబు, గుర్ల మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సన్యాసినాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జైహింద్‌కుమార్, దర్గా కమిటీ సభ్యులు, వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు


