రథంపై ఊరేగిన రాములోరు | - | Sakshi
Sakshi News home page

రథంపై ఊరేగిన రాములోరు

Feb 1 2026 3:33 AM | Updated on Feb 1 2026 3:33 AM

రథంపై

రథంపై ఊరేగిన రాములోరు

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శనివారం శ్రీరామనామస్మరణతో మార్మోగింది. సీతాసమేత శ్రీరామచంద్రస్వామి వారి రథయాత్ర మహోత్సవం కనులపండువగా సాగింది. ఏటా స్వామివారి తిరుక్కల్యాణం అనంతరం మూడోరోజు నిర్వహిస్తున్న రథయాత్రను కనులారా తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ బలిహరణం చేపట్టి శ్రీరాముడి సన్నిధిలో శ్రీమద్రామాయణ పారాయణ, వేద పఠనం, వైదిక సదస్యం, తదితర కార్యక్రమాలను జరిపించారు. వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో శ్రీరామచంద్రమూర్తిని సుందరంగా అలంకరించారు. సాయంత్రం 6 గంటలకు వేద పండితులంతా పండిత పరిషత్‌ నిర్వహించి నాలుగు వేదాలను భక్తి శ్రద్ధలతో పఠించారు. అనంతరం పండిత పరిషత్‌ ఎంతో వైభవంగా జరిగింది. ఈ పరిషత్‌లో సీతారాముల గుణగణాలను వివరించేందుకు వేద పండితుల పోటీపడిన సన్నివేశం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం వేద పండితులను దేవస్థాన అధికారులు ఘనంగా సన్మానించారు.

రథంపై తిరువీధుల్లో ఊరేగిన రాములోరు...

స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలనంతరం మంగల వాయిద్యాల నడుమ సీతారామచంద్రస్వామి వారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఆలయం చుట్టూ ప్రదక్షణ చేశారు. అనంతరం స్వామివారిని రథంపై ఆసీనులను చేసి విశేష అర్చనలు జరిపారు. రాత్రి 10 గంటలకు వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ, భక్తుల జయజయ ధ్వానాల మధ్య సీతారామ లక్ష్మణులు రామతీర్థం పురవీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన రథయాత్రతో రామతీర్థం పులకించింది. ఆలయ ప్రతిష్ట జరిగిన నాటి నుంచి ఆనవాయతీగా వస్తోన్న సీతారామునిపేట, జగ్గరాజుపేట, గొర్లిపేట గ్రామస్తులు రథాన్ని లాగి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. ఆలయం సమీపంలోని ప్రధాన రహదారి వద్ద ప్రారంభమైన రథయాత్ర కుమ్మరిఖానా, బ్రాహ్మణ వీఽధి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఆలయంలోకి తీసుకువెళ్లి వెండి మండపంలో ఆసీనులు చేశారు. రథయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రమూర్తి రథయాత్ర

స్వామివారి సన్నిధిలో వైభవంగా పండిత పరిషత్తు

కనులారా తిలకించి భక్తజనం

రథంపై ఊరేగిన రాములోరు 1
1/1

రథంపై ఊరేగిన రాములోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement