9న కలెక్టరేట్ వద్ద ధర్నా
● సాగునీటి సాధనకు.. రైతన్న సమరం
పార్వతీపురం రూరల్ : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సాధించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 9న పార్వతీపురం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకటించింది. శనివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను సంఘం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బంటు దాసు మాట్లాడుతూ.. జంఝావతి, తోటపల్లి, పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డ సహా జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని కోరారు. ‘ప్రాజెక్టుల సాధన–రైతన్నల వేదన’ ముగియాలంటే పోరాటమే మార్గమని పేర్కొన్న ఆయన ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాలో రైతులు, కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి రమణమూర్తి, నాయకులు బి.అప్పారావు, ఇ.గౌరమ్మ, కరణం రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
కుశ జలపాతానికి ప్రత్యేక బస్సు సర్వీసు
గుమ్మలక్ష్మీపురం: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కుశ గ్రామ పరిసరాల్లో రూపుదిద్దుకున్న జలపాతాన్ని పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా ప్రత్యేక బస్సుసర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శనివారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. ప్రతీ శని, ఆదివారం కుశలోయ జలపాతానికి బస్సును నడుపుతున్నట్లు వెల్లడించారు.
విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు
పార్వతీపురం రూరల్ : జిల్లా కేంద్రంలో విజిలెన్స్ అధికారులు శనివారం మెరుపు దాడులు చేశారు. దాడుల్లో రికార్డుల్లేని భారీ గుట్కా, ఖైనీ నిల్వలు వెలుగు చూశాయి. పట్టణంలోని షిర్డీ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.15లక్షల విలువైన ఆరు రకాల ఉత్పత్తులను తనిఖీ చేయగా.. కేవలం రెండింటికే బిల్లులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పట్టణ శివారులోని వ్యాపారి దుంప శ్రీనివాసరావు వద్ద లభించిన పది రకాల నిల్వలకు అసలు బిల్లులే లేకపోవడం గమనార్హం. నిబంధనలు గాలికొదిలేసిన ఈ అక్రమ నిల్వలపై పంచనామా నిర్వహించి, జీఎస్టీ అధికారులకు నివేదిస్తా మని విజిలెన్స్ సీఐ సింహాచలం తెలిపారు. దాడుల్లో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నాంబిక, అసిస్టెంట్ కమిషనర్ మహేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
9న కలెక్టరేట్ వద్ద ధర్నా


