నిరక్షరాస్యులను అఽక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి..: కలెక్
గుమ్మలక్ష్మీపురం: గ్రామాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అక్షరాస్యత కేంద్రాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మండ గ్రామంలో నిర్వహిస్తున్న అక్షరాస్యత కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వయోజనులకు చదువు ప్రాముఖ్యతను, కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. ప్రతీ ఒక్కరూ అక్షరాస్యులుగా మారాలని, చదువు ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందన్నారు. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని, చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రత్యేక శ్రధ్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో మండ సర్పంచ్ హైమావతి, మండల మహిళా సమాఖ్య ఏపీఎం సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.
సేవ గుణం పెంపొందించుకోవాలి
విద్యార్థి దశ నుంచే సేవ గుణాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద శనివారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా మానవతా ధృక్పధంతో సేవలందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థలో ప్రతీ ఒక్కరూ సభ్యులుగా చేరాలని కోరారు. అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ సమకూర్చిన దుప్పట్లను పలువురు నిరుపేదలకు, అవసరార్థులకు కలెక్టర్ పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ఎం.శ్రీరామమూర్తి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, ప్రిన్సిపాల్ టి.శ్రీవరం, వైస్ ప్రిన్సిపాల్ డి.రామయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.


