హెల్త్ వర్కర్ల నిరసన
● బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్
పార్వతీపురం రూరల్ : గతేడాది సెప్టెంబర్ నుంచి నిలిచిపోయిన తమ బకాయి వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కలెక్టరేట్ వద్ద శనివారం నిరసన చేపట్టారు. అందని వేతనం.. ఆగని ఆవేదన అన్న చందంగా తమ పరిస్థితి మారిందని, నెలల తరబడి వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆశ యూనియన్ నేతలు ఇందిర, గౌరీశ్వరి, శివాని పేర్కొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్‌ఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలకు అందజేశారు. బకాయిలు చెల్లించడంతో పాటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశలుగా గుర్తించి, వారికి యూనిఫాం, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని యూనియన్ ప్రతినిధులు బృందావతి, రజిని, మహాలక్ష్మి కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ కోశాధికారి జి.వెంకటరమణ, ప్రతినిధులు సూరిబాబు, గంగ శైలజ, వెంకటలక్ష్మి, లక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు.


