ఆస్పత్రికి వెళ్తుండగా ఆటో బోల్తా
● గర్భిణితో పాటు ఏడుగురికి గాయాలు
● పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి
కురుపాం: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడింది. గర్భిణితో పాటు మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలం పెదరావికోన గ్రామానికి చెందిన గర్భిణి తోయక లక్ష్మికి గురువారం అర్ధరాత్రి నొప్పులు వచ్చాయి. ఆమెను కుటుంబ సభ్యులు ఆటోలో రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తుండగా రేగిడి సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గర్భిణి లక్ష్మి, అమరావతి అనే యువతికి చేతులు విరిగిపోయాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పీహెచ్‌సీకి తరలించారు. గర్భిణి పరిస్థితి విషమించడంతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వెంటనే అక్కడి వైద్యులు చికిత్స అందించగా... ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఆస్పత్రికి వెళ్తుండగా ఆటో బోల్తా


