సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: ప్రజలు సంతృప్తి చెందే విధంగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం పీహెచ్‌సీ వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల పట్ల వైద్యులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఆస్పత్రుల్లో మందులు కొరత లేకుండా చూడాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రోగులు సంతృప్తి చెందే విధంగా సేవలు మెరుగు పడాలని తెలిపారు. మాతృ, శిశు మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపించాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పారిశుధ్యంపై నిఘా ఉంచాలని తెలిపారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తదితరులు పాల్గొన్నారు.


