గోవులను తరలిస్తున్న వాహనం సీజ్
సాలూరు: గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టణ పరిధిలో శుక్రవారం సీజ్ చేసినట్టు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పట్టణ శివారులో వాహన తనిఖీలు చేపట్టగా గోవులను తరలిస్తున్న లారీని పట్టుకున్నామని చెప్పారు. 27 గోవులను ఒక లారీలో తరలిస్తుండగా చట్టబద్దమైన పత్రాలు లేకపోవడంతో సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. గోవులను సురక్షిత సంరక్షణ కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు.
ముగ్గురు గంజాయి స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు
పార్వతీపురం రూరల్ : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు నిందితులకు విజయనగరం ఎన్‌డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2024 ఆగస్టు 23న పాచిపెంట మండలం రోడ్డవలస జంక్షన్ వద్ద 10.2 కిలోల గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ప్రవీణ్‌కుమార్, శక్తి మురగన్ పననివేల్, నెల్లూరు జిల్లాకు చెందిన ఎల్లంగారి సురేష్‌లను పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదైన ఐదు నెలల్లోనే దర్యాప్తు పూర్తి చేసి పక్కా ఆధారాలు సమర్పించడంతో న్యాయమూర్తి ఎం.మీనాదేవి శుక్రవారం ఈ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. గంజాయి సాగు, విక్రయం లేదా రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
గర్భిణులకు ‘అభా’ నమోదు తప్పనిసరి
పార్వతీపురం రూరల్ : మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా జిల్లాలో వైద్య సేవలు అందాలని జిల్లా ఏసీడీ అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. ఆరోగ్య కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఆశా నోడల్ సిబ్బంది సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతీ గర్భిణీకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) నమోదు తప్పనిసరని స్పష్టం చేశారు. ఇ–ఆశా యాప్ ద్వారా సేవల నమోదును పర్యవేక్షించాలని, గడువులోగా టీకాలు వేయాలని ఆదేశించారు. ఆర్‌బీఎస్‌కే ద్వారా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కేన్సర్, కుష్టు వ్యాధి లక్షణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు ‘స్పర్శ’ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో పలువురు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
పాచిపెంట: మండలంలోని తంగలాం గ్రామానికి చెందిన గెమ్మెల సురేష్ ఇంటికి విద్యుత్ పనుల నిమిత్తం అరకు వ్యాలీ కందులగుడా గ్రామానికి చెందిన వంతల రాజారావు ఈ నెల 28న వెళ్లాడు. ఈ నెల 29న సురేష్ ఇంటి ముందే రాజారావు మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు సురేష్ సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న రాజారావు కుటుంబ సభ్యులు ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ అర్జున్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు హెచ్‌సీ కృపారావు తెలిపారు.
జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ
నెల్లిమర్ల రూరల్: చండీఘర్‌లో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో మండలంలోని గరికిపేట గ్రామానికి చెందిన సీనియర్ వెయిట్‌లిఫ్టర్ బెల్లాన నాని సత్తా చాటింది. 77 కేజీల విభాగంలో శుక్రవారం పోటీల్లో పాల్గొన్న ఆమె రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
గోవులను తరలిస్తున్న వాహనం సీజ్
గోవులను తరలిస్తున్న వాహనం సీజ్


