కనికరించండి సారూ..!
● ఆదరించి ఆటస్థలం ఇప్పించండి ● కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్న విద్యార్థులు
సాక్షి, పార్వతీపురం మన్యం:
జిల్లాలోని గరుగుబిల్లి మండల కేంద్రంలో విద్యార్థులు తమ పాఠశాల ఆటస్థలం కోసం కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ‘ఆట స్థలం మా హక్కు‘ అంటూ చిన్నపాటి పోరాటమే చేస్తున్నారు. ఈ మేరకు గురువారం తమ మండలంలో పర్యటనకు వచ్చిన కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి కాళ్ల మీద విద్యార్థులంతా పడి వేడుకోవడం..జిల్లాలోని ప్రస్తుత విద్యావ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. తమ పాఠశాలలను మరో చోటకు తరలించవద్దని గత విద్యాసంవత్సరం మొదట్లో పలు పాఠశాలల విద్యార్థులు అధికారుల చుట్టూ తిరిగిన విషయం విదితమే. ఇప్పుడు ఆటస్థలం కోసం మరో పాఠశాల విద్యార్థులు ప్రాధేయపడడం గమనార్హం.
గరుగుబిల్లి గ్రామపంచాయతీలో ఉన్న ఎంపీపీ మోడల్ పాఠశాలలో 64 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఎంఆర్‌సీ భవనం ఉండేది. అది శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనం మంజూరైంది. ఈ నూతన భవనం పాత దాని కంటే విశాలంగా ఉంది. ఎంఆర్‌సీ భవనం ఎంపీపీ స్కూల్ వద్ద నిర్మించడం వల్ల ఇక్కడ పిల్లలకు ప్రార్థన చేయడానికి, ఆడుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి.
ఇదే విషయమై పాఠశాల చైర్మన్ తుమ్మగుంట శంకరరావు, గ్రామ పెద్దలు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు చర్చించి..గత డిసెంబరు 15న కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సంబంధిత తహసీల్దార్ విచారణ జరిపి, గరుగుబిల్లి పంచాయతీ హిక్కింవలస రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 10–2ఏలో సుమారు ఐదు సెంట్ల స్థలాన్ని ఎంఆర్‌సీ భవన నిర్మాణానికి ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగదీశ్వరి ఈ స్థలంలో ఈ నెల ఆరో తేదీన శంకుస్థాపన కూడా చేశారు. మధ్యలో ఏం జరిగిందో గానీ..సంబంధిత కాంట్రాక్టర్ ఎంపీపీ స్కూల్ వద్దే భవన నిర్మాణానికి కొలతలు కొలిచారు. దీంతో పాఠశాల విద్యార్థులు రెండు రోజుల క్రితం మరోసారి నిరసన వ్యక్తం చేశారు. గురువారం మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్‌ను విద్యార్థులు చుట్టుముట్టి, ఏకంగా ఆయన కాళ్ల మీద పడి ప్రాధేయపడడం చర్చనీయాంశమైంది. మమ్మల్ని ఆడుకోనీయండి సారూ..అని వేడుకున్నారు. ఒకవైపు జిల్లా యంత్రాంగం..ఆటలకు ప్రాధాన్యమిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. మరోవైపు పిల్లలకు ఉన్న క్రీడా స్థలాన్ని ధారాదత్తం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


