పరీక్షల భయం వీడండి
● విద్యార్థులకు ఎస్పీ దిశానిర్దేశం
పార్వతీపురం రూరల్: విద్యార్థులు లక్ష్యమే దిక్సూచిగా, క్రమశిక్షణే ఆయుధంగా ముందుకు సాగి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో మనోధైర్యం నింపేందుకు ‘స్పూర్తి – విజయానికి సోపానం’ పేరుతో గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ..సహనం, సాధన, క్రమశిక్షణలే విజయానికి రాజమార్గాలు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా, ప్రణాళికాబద్ధంగా చదివి ప్రతిభను చాటాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను గౌరవిస్తూ, క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని హిత వు పలికారు. మత్తు పదార్థాలకు, సైబర్ మోసాలకు దూరంగా ఉంటూ సాంకేతికతను కేవలం జ్ఞాన సముపార్జనకే వినియోగించుకోవాలని కోరారు. అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఏఎస్పీ మనీషా రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసమే విజయానికి తొలిమెట్టు అని, విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకోవాలని సూచించారు. మోటివేషనల్ స్పీకర్లు చంద్రశేఖర్, ఉదయ్‌కుమార్ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. అనంతరం ప్రతిభ కనబరిచి న విద్యార్థులకు బహుమతులు అందజేసి, అధ్యాపకులను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నాగేశ్వరరావు, సీఐ వెంకట్రావు, ఎస్సైలు, వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
పరీక్షల భయం వీడండి


