కొండంత కష్టం.. కుమిలిపోతున్న కుసుమం..!
తీరని వ్యాధితో విలవిలలాడుతున్న విద్యార్థిని
మెరుగైన వైద్యం కోసం సాయం
అందించాలని వినతి
పార్వతీపురం రూరల్: ఓ చిన్నారి బతుకు అగమ్యగోచరంగా మారింది. తీరని వ్యాధితో ఆ ఎనిమిదో తరగతి విద్యార్థిని విలవిల్లాడుతోంది. జిల్లాలో గల సీతంపేట మండలంలోని దిగువ దారబ గ్రామానికి చెందిన సవర ప్రియ అనే బాలిక మెడపై గత రెండు నెలలుగా తలెత్తిన పెద్ద గడ్డ (వాపు) ఆమెను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. సీతంపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఈ చిన్నారి, శోషరస గ్రంథుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోంది. గతంలో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో, నిరుపేద తల్లిదండ్రులు సిమ్మయ్య దంపతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రైవేటు వైద్యం చేయించే స్తోమత లేక, బుధవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ కె.హేమలతను కలిసి తమ బిడ్డను ఆదుకోవాలని కన్నీటితో వేడుకున్నారు. మెరుగైన వైద్యం అందించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని ఆ నిరుపేద కుటుంబం ఆశగా ఎదురు చూస్తోంది.


