తప్పులు లేని పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి శ్రీకారం
● భూ సమస్యల పరిష్కారానికి జిల్లాలో స్పెషల్ డ్రైవ్
విజయనగరం అర్బన్: జిల్లాలో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు నిర్వహించిన భూ రీ–సర్వేలో వచ్చిన తప్పులను సరిదిద్దడం, తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించడం, అర్హులైన రైతులందరికీ కచ్చితమైన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్‌ఓలు, గ్రామ సర్వేయర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత పారదర్శకంగా తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించాలని సిబ్బందిని ఆదేశించారు. రికార్డులను జిల్లా స్థాయిలో సరిదిద్దుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకుని కచ్చితమైన వివరాలతో రికార్డులను తయారు చేయాలని సూచించారు. రీ సర్వే పూర్తయిన భూముల సంబంధిత రికార్డులను అప్‌డేట్ చేసి అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో రీ సర్వే పూర్తయిన 432 గ్రామాల్లో సుమారు 2.03 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ప్రతి నెల 2 నుంచి 9వ తేదీ వరకు పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుందని, నెలవారీ లక్ష్యాలు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెలకు 12 గ్రామాల్లో 7,993 ఖాతాలను పరిశీలించాల్సి ఉందని ఏప్రిల్ నెలకు 14 గ్రామాలు ఎంపిక చేశామని చెప్పారు. రెవెన్యూ క్లినిక్‌లకు పదే పదే వినతులు వస్తున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, డీఆర్‌ఓ ఈ.మురళి, ఆర్డఓ దాట్ల కీర్తి, సర్వే శాఖ ఎ.డి విజయకుమార్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


