రహదారి భద్రత నియమాలు పాటించండి
విజయనగరం క్రైమ్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఎస్పీ దామోదర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయనగరంలోని రింగ్ రోడ్‌లో గల పీఎస్‌ఆర్ స్కూల్‌లోని యోగా సెంటర్లో యోగా భారత్ అధ్వర్యంలో మంగళవారం జరిగిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ఏఆర్.దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఆందోళన, మానసిక ఒత్తిడి మధ్య ధ్యానం ఒక శక్తివంతమైన సాధనంగా నిలుస్తుందన్నారు. నిత్యం చేస్తున్న యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, భావోద్వేగం సమతుల్యమై, ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అందరికీ ధ్యానం సమానంగా ఉపయోగకరమని ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం ధ్యానానికి కేటాయించి, శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవరుచుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, రిటైర్ అయిన వారిని, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చేసే బెదింరింపు కాల్స్ కు భయపడవద్దన్నారు. ఇటువంటి నేరగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోన్ చేస్తే సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1930కు అందించాలని సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ పోస్టర్‌ను ఆవిష్కరించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో యోగా టీచర్ ఎస్.వి.కృష్ణారెడ్డి, జాతీయ స్వచ్ఛ భారత్ అవార్డు గ్రహీత ఎం.రామ్మోహన్, ఉపాధ్యాయులు రవి, సత్యనారాయణ, జేఎన్టీయూ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, డాక్టర్ రమణ గార్లు, విజయనగరం టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ సీహెచ్.సురినాయుడు పాల్గొన్నారు.


