వైభవంగా ఉమాసదాశివుని కల్యాణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న ఉమా సదాశివ స్వామి ఆలయంలో శివ పార్వతుల వార్షిక కల్యాణం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ముందుగా గణపతి ఆరాధన అనంతరం, ఉమా సదాశివస్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. వివిధ రకాల పుష్ఫాలు, స్వర్ణాభరణాలతో స్వామివారి ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయానికి తీసుకువచ్చి వేద మంత్రోచ్చారణ నడుమ శివ పార్వతుల కల్యాణాన్ని కనుల పండువగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా ఉమాసదాశివుని కల్యాణం


