ఉపాధి హామీపై దాడి
● దశల వారీ పోరాటాలకు సీపీఎం పిలుపు
విజయనగరం గంటస్తంభం: ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దశల వారీ పోరాటాలు చేపడుతున్నామని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఎల్బీజీ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో పోరాటాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. వామపక్షాల పోరాట ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని మోదీ ప్రభుత్వం పథకంగా మార్చి కోట్లాది మంది కూలీల ఉపాధిని దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. గ్రామాల్లో సర్వేలకు వెళ్లే సిబ్బందిని ప్రజలే నిలదీస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. ఈనెల 30న గాంధీ విగ్రహాల వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమాలు, ఫిబ్రవరి 2న సచివాలయాల వద్ద నిరసనలు, వినతులు, 5న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మార్చిలో చలో లోక్ భవన్ చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఉపాధి హామీ వంటి ప్రజల సమస్యలను విస్మరించి సీఎం దావోస్ వెళ్లడంపై తమ్మినేని ప్రశ్నించారు. నిజంగా పెట్టుబడులు రావాలంటే ప్రజలకు పనికల్పించి వారి ఆదాయాలు పెంచాలన్నారు.


