స్క్రాప్ కలెక్షన్ పాయింట్‌లో అగ్నిప్రమాదం
రాజాం సిటీ: మండల పరిధిలోని వీఆర్‌అగ్రహారం గ్రామసమీపంలో పొగిరి గ్రామానికి చెందిన సిరిపురపు నాగరాజుకు చెందిన స్క్రాప్ కలెక్షన్ పాయింట్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీయడంతోపాటు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అగ్రిమాపక కేంద్రం సిబ్బంది మంటలు అదుపుచేశారు. ఈ ప్రమాదంలో పాలిథిన్ సంచులతోపాటు, 50 ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతైనట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం సంభవించిందని పేర్కొన్నారు.
కొత్తకంచరాంలో గడ్డివాము..
మండల పరిధి కొత్తకంచరాం గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో బోడసింగి రామకృష్ణకు చెందిన నాలుగు ఎకరాల గడ్డి వాములు దగ్ధమయ్యాయి. మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు.


