ఎన్నికల హామీల అమలు కోసం ఎస్‌టీయూ పోరుబాట
● ఈ నెల 30 నుంచి వివిధ దశల్లో ఉద్యమాలు
విజయనగరం అర్బన్: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) పిలుపు ఇచ్చిందని కమిటీ జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎంఆర్ సంస్కృత పాఠశాలలో ఆదివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో పోరుబాట షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 30న మండల కేంద్రాల్లో వినతిపత్రాలను అధికారులకు అందజేయాలని, వచ్చే నెల 10న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 25న ‘చలో విజయవాడ’ నిర్వహిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు గడిచినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యాం మాట్లాడుతూ వెంటనే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని పీఆర్‌సీ కమిషన్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు దీర్ఘకాలంగా చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సెలింగ్ సభ్యుడు గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్‌ఎస్‌దొర, అప్పలనాయుడు, ఎ.వెంకటఅప్పారావు, ఎస్.మస్తాన్ నాయుడు, డీఎస్‌బాబాజీ, ఎస్.ఉమామశేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


