పండగ శుభాకాంక్షలు
● కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి
పార్వతీపురం: జిల్లా ప్రజలకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భోగి పండగ ప్రతి ఇంటా భోగభాగ్యాలు కల్పించాలని, పంటలు ఇంటికి వచ్చే వేళ ప్రతి ఒక్కరూ ఆనందంగా సంక్రాంతి పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆర్థిక అభ్యున్నతికి అడుగులు వేయాలని, సంక్రాంతి పండగ సందర్భంగా ప్రతి ఇంటా కాంతులు నిండాలని, భోగభాగ్యాలు చేకూరాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఇంటిల్లిపాదీ ఆనందంగా, సంతోషంగా పండగ జరుపుకోవాలని కోరారు. కుటుంబం యావన్మందీ కలుసుకునే ఒక గొప్ప పర్వ దినమని, అదేవిధంగా అన్ని బంధాలు దృఢంగా కొనసాగి ప్రతి కుటుంబం అభ్యున్నతి సాధించాలని ఆయన ఆకాక్షించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ
● జనవరి 19 నుంచి కోర్సుల ప్రారంభం
పార్వతీపురం రూరల్: జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ డి.భాస్కర రావు తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా ఎంబ్రాయిడరీ–ఫ్యాబ్రిక్ పెయింటింగ్ (మగ్గం వర్క్) కోర్సును 30 రోజుల పాటు, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్ కోర్సును 35 రోజుల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఈ శిక్షణలకు అర్హులని, కనీసం 10వ తరగతి చదివి ఉండాలని (పాస్ లేదా ఫెయిల్) తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల మహిళలు తమ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో జనవరి 19, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9959521662, 9985787820, 9493907505 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
పోలమాంబను దర్శించుకున్న భక్తులు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. సోమవారం రాత్రి చదురుగుడికి శంబరపోలమాంబ చేరుకున్న విషయం భక్తులకు తెలిసిందే. చదురుగుడిలో కొలువైన పోలమాంబ అమ్మవారిని భక్తులు మంగళవారం దర్శించుకుని, అమ్మవారి ఘటాలకు పూజలు చేశారు. కాళ్ల నొప్పుల కారణంగా మంగళవారం అమ్మవారు చదురుగుడిలో విశ్రాంతి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి గ్రామంలోని అన్ని పురవీధుల్లో అమ్మవారి ఘటాలకు తిరువీధి నిర్వహిస్తారు.
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయం, రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో కొలువైన పైడితల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించారు. మొక్కుబడులు చెల్లించారు. పూజాకార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.
పండగ శుభాకాంక్షలు


