రోడ్డు ప్రమాదంలో చిరువ్యాపారి మృతి
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామ ప్రారంభంలో మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో పెదబొండపల్లి గ్రామానికి చెందిన చిరువ్యాపారి మామిడిపాక శంకర్రావు(60) మృతి చెందాడు. మరో వాహనంపై ఉన్న తాళ్లబురిడికి చెందిన కర్రి ప్రకాష్‌కు తీవ్ర గాయాలు కావడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు.
తీరని లోటు
మృతుడు శంకర్రావు నిత్యం తెల్లవారుజామున ఐదు గంటలకే నిద్రలేచి భార్య లలితమ్మతో కలిసి జంతికలు, చేగోడీలు తయారు చేసేవారు. వాటిని చుట్టుపక్కల గ్రామాల్లోని చిన్నపాటి దుకాణాలకు సరఫరా చేస్తూ వచ్చిన ఆదాయంతోనే భార్యను, వృద్ధురాలైన తల్లిని పోషించేవారు. కుమారులు ఉన్నప్పటికీ, వారు ఉపాధి నిమిత్తం వేర్వేరుగా ఉంటున్న నేపథ్యంలో.. ఆ ఇంటికి శంకర్రావే ఆధారమయ్యారు. కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.


