డిజిటల్ బాటలో 42 పీఏసీఎస్‌లు
● జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి
పార్వతీపురం: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని సంఘాలలో సేవలను పారదర్శకంగా అందించేందుకు కంప్యూటరీకరణ వ్యవస్థను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలోని 42 పీఏసీఎస్‌లలో కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. ప్రస్తుతం లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయనగరం డీసీసీబీ పరిధిలో 34 సంఘాలు, శ్రీకాకుళం డీసీసీబీ పరిధిలో 8 సంఘాల రోజువారీ లావాదేవీలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం గుమ్మలక్ష్మీపురం, సీతంపేట మండల కేంద్రాల్లో రెండు పీఏసీఎస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా జిల్లాలో రెండు మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను రిజిస్టర్ చేసినట్లు వివరించారు.
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి
జిల్లాలోని రైతులకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపిక చేసిన 8 మండలాల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం, సీతానగరం, పాచిపెంట, మక్కువ, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, పాలొండ, వీరఘట్టం మండలాల అధికారులతో మాట్లాడారు. గ్రామ సర్వేయర్లు క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి తప్పులు లేకుండా వివరాలను నమోదు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి అర్హులైన రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.హేమలత, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్‌లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాధ్ పాల్గొన్నారు.


