మళ్లీ ‘గజ’గజ
పార్వతీపురం రూరల్: గత ఏడాది అక్టోబరులో మండల ప్రజలను హడలెత్తించిన గజరాజులు మళ్లీ మకాం మార్చాయి. కొన్నాళ్లుగా పొరుగు మండలాల పరిధిలో సంచరిస్తూ తిష్ఠవేసిన ఎనిమిది ఏనుగుల గుంపు, సోమవారం ఎట్టకేలకు పార్వతీపురం మండలంలోకి ప్రవేశించింది. దీంతో సంక్రాంతి పండగ వేళ అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. సోమవారం రాత్రి కొమరాడ పరిధిలోని గ్రామాల్లో సంచరించిన ఈ గుంపు, మంగళవారం ఉదయానికి పార్వతీపురం మండలం పెదమరికి మెట్ట సమీపంలోకి చేరుకుంది. అక్కడి చెరువు పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం లక్ష్మీనారాయణపురంలో ఈ గుంపు బీభత్సం సృష్టించి, ఓ కొబ్బరి తోటను ధ్వంసం చేసింది. చేతికొచ్చిన పంటను కళ్లెదుటే నాశనం చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలను ఎక్కడ మట్టడిస్తాయోనని కర్షకులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
’అత్యుత్సాహం వద్దు..
అప్రమత్తతే ముద్దు
ఏనుగుల సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పండగ వాతావరణంలో ఏనుగులను చూసేందుకు అత్యుత్సాహంతో వెళ్లొద్దని, అది ప్రాణాలకే ముప్పు తెస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా సెల్ఫీల మోజులో పడి, లేదా గుంపుగా వెళ్లి వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లరాదని సూచించారు. తాత్కాలికంగా పనులను విరమించుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సంక్రాంతి వేళ రైతుల గుండెల్లో దడ
పెదమరికి పరిసరాల్లో ఎనిమిది ఏనుగుల సంచారం


