సర్కారు బడిలో ఓనమాలు దిద్ది.. వీసీగా ఎదిగి
● వెంగాపురం గ్రామవాసి ప్రస్థానం
బలజిపేట: ప్రభుత్వ బడిలో అక్షరాభ్యాసం చేసి ఇసుకలో ఓనమాలు దిద్దిన స్థాయి నుంచి తిరుపతి యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఎదిగిన తాతా నరసింగరావును బలిజిపేట మండలం, గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఆనాటి రోజుల్లో చదువుకునేందుకు అవకాశాలు లేని పరిస్థితుల్లో అకుంఠిత దీక్ష, చదువే శ్రీరామ రక్షగా సరస్వతీ దేవి ఆశీస్సులతో విద్యను అభ్యసించి ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన పదవులను పొందిన నరసింగరావు గ్రామాల్లో చదువుకునేవారికి ఆదర్శంగా నిలిచారు.
కుటుంబనేపథ్యం
తండ్రి తాతా సూర్యనారాయణ. బలిజిపేట మండలంలోని వెంగాపురం గ్రామంలో నివసించేవారు. ఆ రోజుల్లో బతకలేని బడిపంతులు ఉద్యోగం చేసేవారు. ఆయన భార్య వెంకటరత్నం. వారికి ఆరుగురు సంతానం. వారిలో నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అందరిలో చివరివాడే నరసింగరావు.
విద్యాభ్యాసం, ఉద్యోగం సాగిందిలా..
నరసింగరావు ప్రాథమిక విద్య (1నుంచి 5వరకు)ను వెంగాపురం ఎలిమెంటరీ పాఠశాలలో చదివి అనంతరం బలిజిపేట ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్, డిగ్రీ(బీఎస్సీ) బొబ్బిలి రాజా కళాశాలలో చదివారు. అనంతరం బీఈడీ విద్యను మైసూర్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఒక సంవత్సరం చదివారు. ఆ తరువాత ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్ యూనివర్సిటీ కాశీలో చదివి అక్కడే 7సంవత్సరాలు ఉన్నారు. ఆ తరువాత పోస్ట్ పీహెచ్‌డీ రీసెర్చ్ పరంగా జపాన్ వెళ్లి అక్కడ 7సంవత్సరాలు పనిచేశారు. 2003లో తిరిగి భారతదేశం వచ్చి ఏఆర్‌సీఐ(గవర్నమెంట్ రీసెర్చ్ లేబొరెటరీ)హైదరాబాద్‌లో 2సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తరువాత 18నెలలు రీసెర్చ్ అడ్వైజర్‌గా పనిచేశారు. గత సంవత్సరం అక్టోబర్‌లో తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
కళారంగంపై అభిరుచి
నరసింగరావుకు కళారంగంపై మక్కువ. చదువుకునే రోజుల్లో కళాప్రదర్శనల్లో పాల్గొనడం ఆయనకు అలవాటు. సినిమా పాటలు పాడడం, నాటకరంగంలో వేషాలు వేయడం, ప్రాంటింగ్ వంటి వాటిపై శ్రద్ధ చూపేవారు. స్నేహితులతో ఎంతో సంబరంగా ఉండేవారు.
సర్కారు బడిలో ఓనమాలు దిద్ది.. వీసీగా ఎదిగి


