మద్యం ప్రియులకు పండగ కిక్కు..!
బాటిల్‌పై రూ.10 పెంపుదలకు ప్రభుత్వం అనుమతి జీవో రాకముందే ‘సొమ్ము’ చేసుకుంటున్న సిండికేట్ జిల్లాలోని వైన్‌షాపుల్లో మొదలైన దోపిడీ
సాక్షి, పార్వతీపురం మన్యం:
పండగ వేళ మద్యం ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సీసాపై రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎకై ్సజ్ అధికారులకు సోమవారం రాత్రి ఉత్తర్వులు అందాయి. అయితే, లిఖిత పూర్వక ఆదేశాలు రాకముందే... నాలుగు రోజులుగా జిల్లాలోని వైన్‌షాపుల యజమానులు రూ.10 చొప్పున వడ్డన వేసి విక్రయించడం గమనార్హం. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు బార్లు, మద్యం దుకాణాలు దిగుమతి చేసుకునే మద్యం ధరలో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు అడిషనల్ రిటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో మద్యం షాపుల లైసెన్సుదారులకు ఎంఆర్‌పీపై మార్జిన్ ఒక శాతం పెంచాలని, దీనివల్ల ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు లిక్కర్ సీసాపై రూ.10 చొప్పున పెంచా లని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మందు బాబు లకు పండగతో షాక్ ఇచ్చినట్లయింది. అంతా సిండికేట్.. ఎక్కడైనా ఒకటే రేటు
జిల్లాలో 58 మద్యం దుకాణాలు, ఆరు బార్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం వెలువడిందే తడవుగా జిల్లాలోని మద్యం దుకాణాలు అమలు చేయడం మొదలుపెట్టేశాయి. అనధికార పెంపును ‘సిండికేట్’గా ఆచరణలోకి తెచ్చాయి. నాలుగు రోజులుగా పెరిగిన ధరలతోనే విక్రయిస్తున్నారు. దీనికితోడు.. పండగ పుణ్యమా అని బెల్టుషాపులకూ జోరుగా సరుకు తరలిస్తున్నారు. అక్కడ కూడా మరో రూ.5 అదనంగా విక్రయించాలని అనధికార ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో మద్యం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకముందే దోపిడీ మొదలు పెట్టడంపై మందుబాబులు ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలోని మద్యం దుకాణాల ద్వారా పండగ, ఇతర ప్రత్యేక సందర్భాల్లో రోజుకు రూ.2 కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయి. ప్రస్తుతం సంక్రాంతి పండగ సీజన్ కావడంతో భారీగా లాభాలు సంపాదించేందుకు మద్యం సిండికేట్ మాఫియా సిద్ధమైపోయింది. వాస్తవానికి బీర్లు, రూ.99 మద్యంపై ఈ పెంపు నిర్ణయం వర్తించనప్పటికీ.. మొత్తంగా దేనికైనా తాము అమలు చేసిందే జీవో అన్నట్లు జిల్లాలో మద్యం దుకాణదారులు రేటు పెట్టేసి, దోచుకుంటున్నారు. ప్రజాప్రతినిధులకు, ఎకై ్సజ్ అధికారులకు పండగ మామ్మూళ్లు అందిపోవడంతోనే కిమ్మనకుండా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


