కొండెక్కిన కోడి ధర
కురుపాం: సంక్రాంతి పండగ సందర్భంగా నాటు కోడి ధర కొండెక్కింది. ఒక నాటు కోడి ధర రూ.1000 నుంచి రూ.1500 వరకు మార్కెట్‌లో పలుకుతోంది. తప్పని పరిస్థితుల్లో ప్రజలు ఎంత ధర ఉన్నా కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే అదునుగా చేసుకున్న వ్యాపారులు అచ్చంగా నాటు కోడిలా ఉండే రెండో రకం కోడిని కూడా అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒరిజనల్ నాటు కోడిని పోలి ఉన్న రెండో రకం కోడి వెయ్యి రూపాయల లోపే విక్రయించాల్సి ఉన్నప్పటికీ నాటు కోడే అని చెప్పి ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. రెండు రకాల కోళ్లు ఒకేలా ఉండడంతో ప్రజలు పోటి పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఒరిజనల్ నాటు కోడి కాళ్లు నల్లగాను, ముక్కు సూదిగాను ఉంటుందని రెండోరకం కోడి కాళ్లు మాత్రం పసుపు రంగులో ఉంటాయని నాటు కోళ్ల పెంపకం దారులు చెబుతున్నారు. వాటిలో తేడా తెలియక ప్రజలు మోసపోతున్నట్లు తెలిపారు.


