అన్నదాత కష్టం.. దళారుల పాలు..!
పార్వతీపురం రూరల్: ఆరుగాలం కష్టించి, ఎకరాకు దాదాపుగా రూ.30 వేలు పెట్టుబడిగా పెట్టి, మోంథా తుఫాన్‌లను సైతం తట్టుకుని అనేక అవస్థలు పడుతూ నిలబడిన అన్నదాతకు.. పంట చేతికందే వేళ కన్నీరే మిగులుతోంది. ఖరీఫ్ వరి కోతలు కోత మిషన్ల సాయంతో జోరందుకున్నాయి. ఎకరాకు రూ.3000 నుంచి రూ.3300 వరకు కోతలకే వెచ్చిస్తున్న రైతుకు, పండించిన పంటను అమ్ముకునేందుకు మాత్రం దారి దొరకడం లేదు. కూటమి ప్రభుత్వం జిల్లాలో 190 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని, 2.52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రకటించినా.. ఆచరణలో మాత్రం వాటి జాడ లేదు. దీంతో ఇప్పటికే కోసిన పంటను ఏం చేయాలో తెలియక, నిల్వ ఉంచేందుకు వీలులేక.. రైతులు తమ ఇళ్ల ఎదుట రోడ్లపైన, వ్యవసాయ కళ్లాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టి పడిగాపులు కాస్తున్నారు.
అధికారుల జాప్యంతో.. దళారులకే లాభం..
రైతుల ఇబ్బందే అదునుగా దళారులు రంగప్రవేశం చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,369 ఉండగా, దళారులు మాత్రం రూ.1800 నుంచి రూ.2000 వరకే చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల వ్యాపారులు 42 కిలోల బస్తాను కేవలం రూ.700కే కొనుగోలు చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం ఇదే బస్తాకు రూ.946 దక్కాల్సి ఉండగా, బస్తాకు రూ.246 నష్టాన్ని రైతులు భరించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ జాప్యంపై అధికారులను ఆరా తీయగా ఈ నెల 15వ తేదీ తర్వాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావచ్చు అని స్పష్టత లేని విధంగా చెప్పడం రైతుల ఆందోళనను మరింత పెంచుతోంది. అప్పటి వరకు వాతావరణ హెచ్చరికల నడుమ పంటను ఎలా కాపాడుకోవాలని, వర్షాలు వస్తే గతేమిటని అన్నదాతలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దళారులకే విక్రయించడమే మేలని అమ్మేస్తున్నారు.
కళ్లాల్లోనే ధాన్యం.. కానరాని కొనుగోలు
కూటమి సర్కార్ తీరుతో రైతుల బేజారు
ఎకరాకు పెట్టుబడి రూ.30 వేలు...
మిగిలేది కన్నీళ్లే..
తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు అప్పజెబుతున్న ధాన్యం
క్వింటాకు రూ.570 నష్టానికే
విక్రయాలు
ఏర్పాట్లు చేస్తున్నాం..
ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా మిల్లుల నుంచి బ్యాంక్ గ్యారంటీలు స్వీకరించే ప్రక్రియ, అవసరమైన గోనె సంచుల సేకరణ ప్రక్రియ తుది దశలో ఉన్నాయి. సాంకేతికపరమైన అంశాలు, సిబ్బంది కేటాయింపులు కూడా పూర్తి చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఏదేమైనా ఈ నెల 15వ తేదీలోపు జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలను తప్పనిసరిగా ప్రారంభించి, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తాం.
– శ్రీనివాస్, పౌర సరఫరాల
సంస్థ జిల్లా మేనేజర్


