సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే...
● అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్
● కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి
విజయనగరం గంటస్తంభం: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక కేఎల్ పురం కమ్యూనిటీ హాల్‌లో ఆ సంఘం ఉమ్మడి జిల్లాల మహాజన సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు ఉన్న హెచ్‌ఆర్‌సీ పాలనీ అన్ని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేయాలని కోరారు. పీఆర్‌సీలో కనీస వేతనాన్ని రూ.26 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని, ప్రతి ఏటా రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సెలవులు, హెల్త్‌కార్డు వంటి సదుపాయాలు తమకు కల్పించాలన్నారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైరయ్యే ఉద్యోగులకు కనీసం రూ.20లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల 60 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చారని కానీ సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. థర్డ్ పార్టీ సంస్థలకు పనులు అప్పగించడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. సభలో ఏపీ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దూసి భానోజీరావు, జనరల్ సెక్రటరీ పి.గురునాథ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జి.మహేంద్రబాబు, పెద్ద సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.


