బాలాలయంలోనే పైడితల్లి దర్శనం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలవిరాట్‌కు ఎటువంటి ఆటంకం కలగకుండా బాలాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 10న సోమవారం ఉదయం 9 గంటల నుంచి బాలాలయం వద్ద వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆలయ ఇన్‌చార్జ్ ఈవో కె.శిరీష శనివారం తెలిపారు. వైదిక సిబ్బందితో కళాప్రకర్షణ చేపట్టనున్నామన్నారు. దేవాలయ విస్తరణ పనులు పూర్తయినంత వరకూ అమ్మవారిని బాలాలయంలోనే భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ నెలలో వచ్చే మూడో మంగళవారం చదురుగుడి వద్ద నిర్వహించే చండీహోమ కార్యక్రమాలను రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి వద్ద నిర్వహిస్తామన్నారు. దేవాలయ పనులు పూర్తయ్యేవరకూ ప్రధాన ఆలయంలో దర్శనాలు ఉండవన్నారు.
రెజ్లింగ్‌లో సత్తా చాటిన విద్యార్థులు
చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి శ్రీరామ్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభను చాటారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన కడగల కిషోర్, గురాన దిలీప్, మాడుగుల అఖిల్, ఆరంగి ఉన్ముక్త సత్తా చాటి రజత పతకాలను సాధించారు. రారష్ట్‌ర స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి రజత పతకాలను సాధించిన విద్యార్థులను మండల ప్రత్యేకాధికారి పి.రామారావు, హెచ్‌ఎం నిర్మల, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.ఉదయ్‌కుమార్, సహోపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
తూనికల కాటాలకు సీల్స్ తప్పనిసరి
● జిల్లా అధికారి రత్నరాజు
వీరఘట్టం: ప్రతీ వ్యాపారస్తుడు తమ షాపుల్లో వినియోగించే కాటాలకు ప్రతీ ఏటా సీల్స్ వేయించాలని జిల్లా తూనికులు, కొలతల అధికారి కె.రత్నరాజు సూచించారు. స్థానిక కోదండరామ కల్యాణ మండపంలో కాటాలకు సీల్స్ వేసే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దీంతో మండల వ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులు తమ కాటాలకు సీల్స్ వేయించడానికి తీసుకువచ్చారు. ఆ కాటాలకు ప్రైవేటు ఏజెన్సీ సభ్యులు సీల్స్ వేశారు. ప్రతీ కాటాకు రూ.1500 లు సర్వీసు చార్జీలు వసూళ్లు చేస్తుండడంపై వ్యాపారులు మండిపడుతున్నారు. అధికారుల సమక్షంలోనే అందరి వద్ద ఇలా వసూళ్లు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
డిజిటల్ అసిస్టెంట్ సస్పెన్షన్
మెంటాడ: మండలంలోని జయతి సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ నెక్కల శ్రీనును కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చినట్టు డిప్యూటీ ఎంపీడీవో విమలకుమారి శనివారం తెలిపారు. అక్టోబర్ నెలకు సంబంధించి 15 మంది సామాజిక పింఛన్‌దారుల పింఛన్ సొమ్ము రూ.70,500 లబ్ధిదారులకు అందజేయకుండా సొంత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేసినట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో శ్రీనును సస్పెండ్ చేసినట్టు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
సీతంపేట: మండలంలోని హడ్డుబంగి మలుపు వద్ద ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో చింతాడకు చెందిన రామారావుకు గాయాలయ్యాయి. కొత్తూరు నుంచి వస్తున్న ఆటో సీతంపేట నుంచి కొత్తూరు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయాలైన వ్యక్తి స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అమ్మన్నరావు తెలిపారు.
బాలాలయంలోనే పైడితల్లి దర్శనం
బాలాలయంలోనే పైడితల్లి దర్శనం


