ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలి : యూటీఎఫ్
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ లేకపోవడం వలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం తక్షణమే జీవో నంబరు 73, 74 ప్రకారం ఉమ్మడి సర్వీసులు ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా కమిటీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ లేకపోవడం వలన డీఈవో, డిప్యూటీ డీఈవో వంటి కీలక పదవుల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా ప్రమోషన్ పొందకపోవడం విచాకరమన్నారు. జీవో 243 రద్దు కారణంగా పాఠశాల విద్య నుంచి కళాశాల విద్యను వేరు చేయడం వలన జూనియర్ లెక్చరర్ పోస్టులలో ఉపాధ్యాయులకు ప్రమోషన్ అవకాశం లేకపోవడం అన్యాయమని ఆరోపించారు. నాన్ టీచింగ్ సిబ్బందికి జూనియర్ లెక్చరర్‌గా ప్రమోషన్ కల్పిస్తూనే అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆ అవకాశం ఇవ్వకపోవడం అసంబద్దమని ఆయన పేర్కొన్నారు. సర్వీసు రూల్ అమలు చేయకపోవడం వల్ల ప్రస్తుతం 400కు పైగా మండలాల్లో ఎంఈవో–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇది విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని స్పష్టం చేశారు.
టెట్ నుంచి మినహాయించాలి
2001–10 కంటే ముందు నియమించబడి ఐదేళ్లకి పైగా సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావాలనే నిబంధన నుంచి మినహాయించాలని కోరారు. డీఎస్సీ రాసి ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులను నేడు టెట్ పాస్ కావాలని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీఆర్‌కే ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


