జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి, బాసంగి గదబవలస, వెంకటరాజపురం పంట పొలాల్లో బుధవారం సాయంత్రం ఏనుగులు దర్శనమిచ్చాయి. సాయంత్రం వెంకటరాజపు రం గ్రామం పొలిమేరలోకి రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వరి, అరటి పంటలు ధ్వంసం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగులు తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉపాధిహామీ పనుల్లో
అలసత్వం వద్దు
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం టౌన్: ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనుల్లో అలసత్వం వద్దని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్ట ర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఉపాధిహామీ నిధులతో చేపట్టిన ప్రహరీలు, మినీ గోకులాలు, ఇంకుడు గుంత లు, ఫారంపాండ్‌లు, ఫిష్ పాండ్లు, రోడ్ల పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో 334 ప్రహరీ నిర్మాణాలు మంజూరు చేయగా 67 మాత్రమే పూర్తయ్యాయన్నారు. భామిని, పాచిపెంట, సాలూరు, కురుపాం, పార్వతీపు రం, సీతానగరం మండలాల్లో ప్రగతి కనిపించాలన్నారు. 988 మినీ గోకులాలకు 113 పూర్తయ్యాయన్నారు. సాలూరు, పార్వతీపురం, భామిని, సీతంపేట, పాచిపెంట మండలాల్లో పురోగతి సాధించాల్సి ఉందన్నారు. ఉపాధి హామీ పనులను వేగవంతంగా పూర్తిచేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించా రు. సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ. ప్రభాకరరావు, ఎంపీడీఓలు, ఇతర అధికారు లు పాల్గొన్నారు.
కేజీబీవీల్లో ప్రవేశాలకు పిలుపు
వీరఘట్టం: 2025–26 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల కోసం బాలికలకు కేజీబీవీలు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాయి. 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్లు భర్తీకి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ప్రవేశాల్లో అనాథలు, బడిబయట ఉన్న చిన్నారులు, బడి మధ్యలో మానేసిన బాలికలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న బాలికలకు తొలి ప్రాధాన్యం కల్పిస్తారు. ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, సంబంధిత ప్రింట్‌కు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, ఆదాయ ధ్రువపత్రాలు, స్టడీ సర్టిఫికెట్ జిరాక్స్‌లు, పాస్‌ఫొటో జతచేసి సమీప కేజీబీవీల్లో అందజేయాలి. జిల్లాలోని వీరఘట్టం, సీతంపేట, భామిని, గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలస, జి.ఎల్.పురం, పార్వతీపురం, సాలూరు, కొమరాడ, బలిజిపేట, మక్కువ, సీతానగరం, పాచిపెంట మండలాల్లోని 14 కేజీబీవీల్లో ఆరో తరగతిలో 560 సీట్లు, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో వివిధ గ్రూపుల్లో 560 సీట్లు భర్తీ చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులను ఏప్రిల్ 16 నుంచి 18 వరకు పరిశీలిస్తారు.
అర్హులైన తొలి జాబితాను ఏప్రిల్ 21 ప్రకటిస్తారు. తర్వాత ఏప్రిల్ 25న ఎంపికై న బాలికల రెండవ జాబితా ప్రకటిస్తారు. కొన్ని కేజీబీవీలు ఉచితంగా ఆన్‌లైన్ దరఖాస్తుచేసే ఏర్పాట్లు చేస్తున్నాయి. మరిన్ని వివరాలకు సెల్ 70751 59996, 70750 39990 నంబర్లను సంప్రదించాలని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు కోరారు.
బాసంగి గదబవలసలో ఏనుగుల గుంపు