ఎడిన్‌బర్గ్‌లో మహర్షి శుశ్రుతుడు కాంస్య విగ్రహం | - | Sakshi
Sakshi News home page

ఎడిన్‌బర్గ్‌లో మహర్షి శుశ్రుతుడు కాంస్య విగ్రహం

Jun 25 2026 4:47 AM | Updated on Jun 25 2026 4:47 AM

ఎడిన్‌బర్గ్‌లో మహర్షి శుశ్రుతుడు కాంస్య విగ్రహం అభివృద్ధి పనులు పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

‘ఫాదర్‌ ఆఫ్‌ సర్జరీ’గా పాశ్చాత్య ప్రపంచంలో దక్కిన గౌరవం తెనాలి ఎన్నారై డాక్టర్‌ చంద్ర చెరువు సహకారం

తెనాలి: దేశంలో వేల ఏళ్ల క్రితమే ప్లాస్టిక్‌ సర్జరీ, కాటరాక్ట్‌ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసి, పరికరాలు రూపొందించిన మహర్షి శుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని ఇంగ్లండ్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌లో ఆవిష్కరించారు. దీనితో ‘ఫాదర్‌ ఆఫ్‌ సర్జరీ’గా పాశ్చాత్య ప్రపంచం అధికారికంగా గుర్తించి గౌరవించినట్టయిందని, మన వైద్య విజ్ఞానానికి దక్కిన గౌరవంగానూ భావిస్తున్నారు. అయితే ఈ గౌరవానికి కారకుడు తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బేరియాట్రిక్‌, లాపరోస్కాపిక్‌ సర్జన్‌ డాక్టర్‌ చంద్ర చెరువు కావటం గర్వకారణం. రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌లో ఈనెల 19వ తేదీన ఏర్పాటుచేసిన 90 కిలోల మహర్షి శుశ్రుతుడు కాంస్య విగ్రహానికి అయిన ఖర్చును ‘చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్‌’ ద్వారా డాక్టర్‌ చంద్ర విరాళంగా ఇచ్చారు. తమిళనాడులోని స్వామిమలైకి చెందిన రాఘవానందం స్తపతి ఈ విగ్రహాన్ని తయారుచేశారు. ఎడిన్‌బర్గ్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ సిద్ధార్థ మాలిక్‌, రాయల్‌ కాలేజి ప్రెసిడెంట్‌ క్లేర్‌ మెక్‌నాట్‌లు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇదే వేదికపై డాక్టర్‌ చంద్ర రచించిన ‘మహర్షి శుశ్రుత ఏ కంపెండియమ్‌ ఫాదర్‌ ఆఫ్‌ సర్జరీ’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.

ఇదే సమయంలో తన తండ్రి, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ సీఎస్‌ శాస్త్రి జ్ఞాపకార్థం రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌లో రెండు శాశ్వత ట్రావెలింగ్‌ సర్జికల్‌ స్కాలర్‌షిప్స్‌ను డాక్టర్‌ చంద్ర ఏర్పాటుచేశారు. రాయల్‌ కాలేజ్‌ని 1505లో స్థాపించారు. 140 దేశాలకు చెందిన 33 వేలమందికి పైగా సుభ్యులు ఇందులో ఉన్నారు.

తొలి నుంచి ఉదారత

2600 సంవత్సరాల తర్వాత మహర్షి శుశ్రుతుడికి ఇంతటి గౌరవాన్ని కల్పించిన డాక్టర్‌ చంద్ర చెరువు స్వస్థలం ఉమ్మడి తెనాలి డివిజనులోని వేమూరు మండల గ్రామం పెరవలి. వీరిది సంపన్న కుటుంబం. వీరి పెద్దలు గ్రామంలో హైస్కూలుకు భూరి విరాళం ఇచ్చారు. చంద్ర తండ్రి డాక్టర్‌ సీఎస్‌ శాస్త్రి విజయవాడలో వైద్యునిగా ప్రాక్టీస్‌ చేశారు. ఆయన బాటలోనే ఉన్నత చదువులు చదువుకొని ఇంగ్లండ్‌లో స్థిరపడిన డాక్టర్‌ చంద్ర, ఇంగ్లండ్‌లోని నార్త్‌ మిడ్‌ల్యాండ్స్‌లో కన్సల్టెంట్‌ బేరియాట్రిక్‌, లాపరోస్కోపిక్‌, అప్పర్‌ జీఐ సర్జన్‌గా చేస్తున్నారు. 1995 నుంచి క్లినికల్‌ పరిశోధనలు పాలుపంచుకుంటున్నారు. స్టోక్‌–ఆన్‌– ట్రెంట్‌ నగరంలో ఉన్న హిందూ సాంస్కృతిక సంఘానికి డాక్టర్‌ చందు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే స్టాన్‌ఫోర్డ్‌లో తొలి హిందూ దేవాలయాన్ని 2025 ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఆలయానికి కావల్సిన కాంస్య, పాలరాతి, గ్రానైట్‌ విగ్రహాలన్నింటినీ భారతదేశం నుంచే రప్పించారు. విదేశంలో స్థిరపడినా సొంతూరు రాకపోకలు చేస్తూ, తమ పెద్దలు భూరివిరాళం ఇచ్చిన స్వగ్రామంలోని హైస్కూలుకు కంప్యూటర్లు సహా అవసరమైన సహకారాన్ని ఇప్పటికీ అందిస్తున్నారని గ్రామస్తులు చెప్పారు.

తాడికొండ: రాజధాని అమరావతిలో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం బుధవారం పరిశీలించింది. ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ఉపాధ్యక్షుడు జోహెన్నస్‌ జుట్‌, లీడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ స్పెషలిస్ట్‌ – టీటీఎల్‌–(అమరావతి ఇంటిగ్రేటెడ్‌ అర్బన్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్టు – ఏఐయుడీపీ) గెరాల్డ్‌ పాల్‌ ఒలివర్‌, ఎడ్యుకేషన్‌ స్పెషలిస్ట్‌ సౌమ్య బజాజ్‌లతో కూడిన బృందం అమరావతిలో పర్యటించింది. పర్యటనలో భాగంగా తొలుత ప్రపంచ బ్యాంకు బృందం ఏపీ సీఆర్డీయే ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించి, అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టు (ఏఐయూడీపీ) కింద చేపడుతున్న పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీని సందర్శించి ఏపీ సీఆర్డీయే సోషల్‌ డెవలప్మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో యూనివర్సిటీలో ఉచితంగా నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. మధ్యాహ్నం రాయపూడిలో ఏపీ సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ వి.విజయరామరాజు, అడిషనల్‌ కమిషనర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌, అమరావతి అభివృద్ధి ప్రణాళికలు, మాస్టర్‌ ప్లాన్‌, ఫైనాన్సింగ్‌ వ్యూహాలు తదితర విషయాలను పపంచ బ్యాంకు బృందానికి వివరించారు. అనంతరం రాజధాని గ్రామాల మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్న జీవనోపాధి కార్యక్రమాలను పరిశీలించి స్థానిక మహిళలతో బృందంలోని సభ్యులు మాట్లాడారు. ఏపీ సీఆర్డీయే, ఏడీసీఎల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement