● తండావాసులకు పని కల్పించకుండా
ఫీల్డ్ అసిస్టెంట్ రాజకీయ వివక్ష,
● పనిచేయకుండా కూర్చున్న
వారికే మస్టర్లు
● తారాస్థాయికి చేరుకున్న
నాయకుల అరాచకం
● ఈపూరు మండలం కొచ్చెర్లలో
ఫీల్డ్ అసిస్టెంట్ నిర్వాకం
ఈపూరు: ఉపాధి హామీ పనులలో కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ కొచ్చర్ల ఫీల్డ్ అసిస్టెంట్ అడవి బిడ్డలపై అధికార రాజకీయ దర్పాన్ని ప్రదర్శిస్తూ వారి జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. మండలంలోని కొచ్చర్ల తండాలో బుధవారం తెల్లవారుజామున ఉపాధి హామీ పనులకు వెళ్లిన తండావాసులకు ఫీల్డ్ అసిస్టెంట్ పని కల్పించకపోవడంతో ఆందోళనకు దిగారు. గత మూడు రోజులుగా పనులు కల్పించకుండా వేధిస్తున్నాడని ఆరోపించారు. తెల్లవారుజామున అయిదు గంటలకే పనులను ప్రారంభిస్తూ తనకు అనుకూలమైన వారికే ముఖ ఆధారిత హాజరు తీసుకొని మిగిలిన వారికి పని కల్పించకుండా వెనక్కి పంపుతున్నారన్నారు. గ్రామంలోని రైతులకు పనులు కల్పిస్తూ గిరిజనులైన తమపై చిన్న చూపు చూస్తున్నారని వాపోయారు. తాము పనులు చేస్తామన్నా పట్టించుకోకుండా పనులు చేయకుండా కూర్చున్న వారికే మస్టర్లు వేస్తున్నారని ఆరోపించారు. కూలి డబ్బుల పంపకాలపై విమర్శలు చేశారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమనే ఆక్కసుతో కావాలనే ఉపాధి పనులకు దూరంగా పెడుతున్నారని ఆవేదన చెందారు. ప్రతిరోజు పనులు చేసుకుంటేనే కుటుంబాలు గడుస్తాయని రాజకీయ వివక్ష చూపుతూ తమ పొట్ట కొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు రాజకీయాలను ఆపాదించడం అన్యాయమని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పించాలని అధికారులను తండావాసులు కోరుతున్నారు.


