మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దిగువ సన్నిధిలో వున్న లక్ష్మీ నరసింహస్వామి వారికి పవన్ కల్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్ కల్యాణ్ ఎగువ సన్నిధిలో వున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని, స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలను డిప్యూటీ సీఎంకు అందించారు.
నకరికల్లు: ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు క్లీనర్ మృతి చెందాడు. ఈ ఘటన స్థానిక అద్దంకి– నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై మండలంలోని శ్రీరాంపురం వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు.. చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మండలంలోని శ్రీరాంపురం సమీపంలో రోడ్డుపక్కన ఆగి ఉన్న సుబాబుల్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులోని క్లీనర్ ఎండ్లూరి సుందర్‌రాజా(21) బస్సు నుంచి కిందపడగా తీవ్రంగా గాయపడ్డాడు. బస్సులోని మరో క్లీనర్‌తో పాటు మహిళకు గాయాలయ్యాయి. దీంతో ముగ్గురిని 108లో నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించగా క్లీనర్ సుందర్‌రాజా చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతునిది ప్రకాశం జిల్లాలోని మన్నేటికోట గ్రామం. ఘటనపై మృతుని తండ్రి రాజేంద్రప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
మండలంలోని శ్రీరాంపురం సమీపంలో లారీని బస్సు ఢీకొనడంతో ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక నిద్రమత్తులో ఉన్న సమయంలో జరిగింది.


