నరసరావుపేట: జూలై 3, 4, 5 తేదీలలో ఏలూరులో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు పిలుపునిచ్చారు. మహాసభల జయప్రదం కోరుతూ కోటప్పకొండ రోడ్డులోని సంఘ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా గిట్టుబాటు ధరల చట్టం చేయాలని, మొక్కజొన్న, మిర్చి, పొగాకు కొనుగోలు చేయాలని రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేసిందని ఫలితంగా ప్రభుత్వాలు కదిలాయని అన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ విత్తనాలు వలన నష్టపోయిన రైతులకు కోట్లాది రూపాయలు పరిహారంగా ఇప్పించి అండగా నిలిచిందని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ వలన నష్టపోతున్న బాధిత రైతులకు అండగా నిలిచి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయం జరగాలని వారి తరఫున పోరాడుతుందని తెలిపారు. రాబోయే కాలంలో రైతాంగం ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభల్లో దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా జూలై 3వ తేదీన జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభలో జిల్లా నుంచి రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభల్లో ఆలిండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, అధ్యక్షులు అశోక్ ధావలే, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రిశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. వాల్‌పోస్టర్ ఆవిష్కరణలో రైతు సంఘం జిల్లా నాయకులు బండారుపల్లి నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, కామినేని రామారావు, బాలకోటయ్య పాల్గొన్నారు.


