నరసరావుపేట: పంచాయతీరాజ్ విభాగ నూతన సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ)గా వేణుగోపాల్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
నేడు చేబ్రోలుకు తీసుకువచ్చే అవకాశం
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలో రెండు రోజుల కిందట అదృశ్యమైన ముగ్గురు బాలుర ఆచూకీ సోమవారం లభించినట్లు తెలిసింది. స్థానికంగా సంచలనం కలిగించిన 7వ తరగతి చదువుతున్న గుండవరం, వేజండ్ల, సుద్దపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు శనివారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తరువాత మాయమయ్యారు. పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారివద్ద ఉన్న సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్, వరంగల్లు తదితర ప్రాంతాలలో గాలింపు చేపట్టారు. ఏడవ తరగతి చదువుతున్న గుండవరం గ్రామానికి చెందిన తుపాకుల గోపి, సుద్దపల్లి గ్రామానికి చెందిన రాయల భరత్, వేజండ్ల గ్రామానికి చెందిన జమీద్ అహ్మద్‌లు అదృశ్యమయ్యారు. వీరిలో ఒక బాలుడు స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేయటంతో ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ఽఢిల్లీ రైల్వేస్టేషన్ సమీపంలో సంచరిస్తున్న బాలురను ఒక షాపు అతను పట్టుకొని స్థానిక పోలీసుస్టేషన్‌లో అప్పగించినట్లు తెలిసింది. స్థానిక పోలీసులు, బాలురు తల్లిదండ్రులు విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంగళవారం చేబ్రోలు పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంది. బాలుర ఆచూకీ లభించటంతో వారి తల్లిదండ్రులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
రైతుల ప్రయోజనాల కోసం కృషి చేయాలి
నాబార్డు డీడీఎం శరత్‌బాబు
కొరిటెపాడు(గుంటూరు): రైతులు పండించిన పంటలకు దళారుల ప్రమేయం లేకుండా సరైన మద్దతు ధర అందేలా ఎఫ్‌పీవోలు, బయ్యర్లు సంయుక్తంగా కృషి చేయాలని నాబార్డు జిల్లా డెవలప్‌మెంట్ మేనేజర్(డీడీఎం) సీహెచ్ శరత్‌బాబు పిలుపునిచ్చారు. సెర్చ్ (సోషల్ ఎకనామిక్ ఆల్టర్నేటివ్స్ రీసెర్చ్ కమ్యూనిటీ అండ్ హ్యుమానిటీ) ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక తాలూకా కాంపౌండ్‌లోని పెన్షనర్స్ సమావేశ మందిరంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, అమ్మకం–కొనుగోలుదారులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. శరత్‌బాబు మాట్లాడుతూ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా పండించిన మిర్చి తదితర పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చేయడమే సదస్సు లక్ష్యమని పేర్కొన్నారు. దేశ జీడీపీలో వ్యవసాయం వాటా 16 నుంచి 18 శాతం కాగా, 45 శాతం మంది జీవనాధారం వ్యవసాయమేనని తెలిపారు. వ్యవసాయ వృద్ధి రేటు 4.4 శాతంగా ఉందన్నారు. విదేశాల్లో వ్యవసాయ యాంత్రీకరణ 90 శాతం ఉంటే మన దేశంలో కేవలం 40 శాతం మంది రైతులే ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారని, వారిలో 64.5 శాతం మంది మహిళలేనని వివరించారు. మిర్చి పంటల్లో రసాయనిక మందులకు బదులు సేంద్రీయ, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. దీంతో రైతులు గిట్టుబాటు ధర పొంది ఆర్థికంగా ఎదుగుతారన్నారు. ప్రభుత్వం, నాబార్డ్డు అందిస్తున్న పథకాలు, రాయితీలపై ఎఫ్‌పీవోలు రైతుల్లో చైతన్యం తేవాలని సూచించారు. నేషనల్ కమోడిటీ డెలివరీ టు ఎక్స్ఛేంజ్ మేనేజర్ అడపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ మార్కెటింగ్ విధానాలను వీడి పెద్ద కంపెనీలతో నేరుగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. సత్య ఇంటెక్స్ వ్యవస్థాపకులు తోట రామకష్ణ మాట్లాడుతూ నాణ్యమైన మిర్చికి విదేశాల్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుందని, రైతులు నాణ్యతపై దృష్టి సారించాలని కోరారు. సెర్చ్ సంస్థ అధ్యక్షులు మన్నవ హనుమంత్ ప్రసాద్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్డు పథకాలను ప్రచారం చేస్తూ ఎఫ్‌పీవోలు, స్వయం సహాయ సంఘాల ద్వారా రైతులు, కొనుగోలుదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని తెలిపారు. సదస్సులో ప్రోగ్రాం కోఆర్డినేటర్ శీలం మల్లికార్జున, శివకుమార్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా ఎఫ్‌పీవోల బోర్డు సభ్యులు, సీఈవోలు పాల్గొన్నారు.


