సీనియర్ ఇంటర్ విద్యార్థులకూ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షకు అవకాశం
సత్తెనపల్లి: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త అందించింది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు సైతం మార్కులు పెంచుకునేందుకు ‘ఇంప్రూవ్‌మెంట్’ పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 27వ తేదీలోగా ఫెయిల్ అయిన విద్యార్థు లతో పాటు ఇంప్రూవ్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులు సూచిస్తున్నారు. మే 21వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదలుకానున్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకు ఫస్టియర్‌కు మాత్రమే...
ఇంటర్మీడియెట్ బోర్డు చరిత్రలో ఇప్పటి వరకు ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం ఉండేది. ఏటా మార్చి నెలలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించిన పేపర్ల (సబ్జెక్టులు)కు ఇంప్రూవ్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ కి పరీక్ష ఫీజులు చెల్లించి, పరీక్షలకు హాజరు కావడం జరుగుతుంది.అయితే ఈ ఇంప్రూవ్‌మెంట్ విధానాన్ని ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసింది. మే నెల 21 నుంచి జరిగే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో సీనియర్ ఇంటర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వులు వెలువరించింది.
ఎక్కువ మార్కులకే ఫిక్స్...
మార్చిలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఏదైనా సబ్జెక్టులో సాధించిన మార్కులు ... ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కులు, ఏవి ఎక్కువ అయితే వాటినే ఇంటర్ బోర్డు పరిగణనలోకి తీసుకోనుంది. అయితే ఇది కేవలం ఫీజులు దండుకునేందుకు వేసిన ఎత్తుగడ అని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి...
జిల్లాలో మొత్తం 30,326 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 14,381 మంది పరీక్షలు రాయగా 11,114 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కనీసం 4 వేల మంది వరకు ఇంప్రూవ్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.


