మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర ఎక్కడ ? | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర ఎక్కడ ?

Mar 19 2026 7:55 AM | Updated on Mar 19 2026 7:55 AM

యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు...

మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ: ఆంధ్రప్రదేశ్‌లో రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎలా ఉన్నారో, కూటమి ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా ఉన్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించారని చెప్పారు. ఈ క్రాప్‌ నమోదు చేసి ప్రతి రైతుకు పంట నష్టం జరిగినప్పుడు సహాయం అందించారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా రైతుల ఖాతాల్లోనే పరిహారం జమ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో క్వింటా రూ.2400 అమ్మిన మొక్కజొన్నలు కేవలం రూ.1600కు కూడా కొనుగోలు లేక రైతులు లబోదిబోమంటున్నారని చెప్పారు. పొగాకు, ధాన్యం, కందులు, ఇతర పంటలు కూడా గిట్టుబాటు ధరకు కొనేవారు లేరని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఒక్క పింఛన్‌ కూడా మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీస అవసరాలకు కూడా గ్యాస్‌ లభించే పరిస్థితి లేదన్నారు.

గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా...

గంజాయి, డ్రగ్స్‌, మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయని, డ్రగ్స్‌ తీసుకుంటూ టీడీపీ పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేష్‌యాదవ్‌ పోలీసులకు దొరకడం సిగ్గుచేటన్నారు. మదనపల్లిలో చిన్నారి హత్య వంటి దారుణాలు కూడా గంజాయి మత్తులోనే జరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రేషన్‌సరుకులు ఇంటి వద్దకే సరఫరా చేశామని పేర్కొన్నారు. గతంలో సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా ఇస్తామంటూ, ప్రజలకు, ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు టోపీ పెట్టారని ఎద్దేవా చేశారు.

స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 50 వేల ఎకరాల్లో హార్టికల్చర్‌ సాగవుతుందని ముఖ్యమంత్రికి అబద్ధాలు చెప్పారని, మిరప, కంది, పత్తి అన్ని పంటలను కలిపినా 50 వేల ఎకరాల సాగులో లేదని గుర్తు చేశారు. గ్రానైట్‌ అక్రమ రవాణా, బెట్టింగ్‌లు, లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించడం వంటివి తప్ప చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవన్నారు. పోలీస్‌స్టేషన్‌ల్లో అక్రమ కేసులు బనాయించడం, కాలనీల్లో బ్రాందీషాపులు ఏర్పాటు చేయడం యథేచ్ఛగా జరుగుతున్నాయని తెలిపారు. అదేమని ప్రశ్నిస్తే వారిపైనే కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని పదవి నుంచి తొలగించాలని మహిళలు ధర్నా చేస్తుంటే వారిపై దాడులు చేయడం దారుణమన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం అంతా గ్రాఫిక్స్‌లో తప్ప వాస్తవ రూపంలో కనిపించడం లేదన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని చిన్న, చితక వారిని బెదిరించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పీ4 పథకంలో భాగంగా 100 కుటుంబాలను దత్తత తీసుకున్నానని చెబుతున్న ఎమ్మెల్యే జీవీ ఒక్కరికన్నా న్యాయం చేశారా అని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలందరికి ఉగాది నూతన సంవత్సరాది శుభాకాంక్షలు, ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్‌.ప్రసాద్‌, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ విభాగం నాయకులు జుజ్జూరి ఐరామ్మూరి, పట్టణ అధ్యక్షులు కొత్తమాసు శివ, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ బేతం గాబ్రియేలు, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ గంధం బాలిరెడ్డి, వినుకొండ మండలం రూరల్‌ కన్వీనర్‌ దండు చెన్నయ్య, శావల్యాపురం కన్వీనర్‌ బోడెపూడి కొండలు, గుంజి వాసు, కొత్త కృష్ణారెడ్డి, బి.నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement