● మిర్చిని కాపాడుకునేందుకు తంటాలు
● మిర్చి, శనగ, మొక్కజొన్నలపై వాన ప్రభావం
నాదెండ్ల:మండలంలో బుధ వారం కురిసిన వర్షంతో రైతులు పరుగులు తీశారు. ఆరుగాలం కష్టించి పండించి కల్లాల్లో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు టార్పాలిన్ పట్టలు తీసుకుని పరుగున వెళ్లి మిర్చి తడవకుండా కప్పారు. కారుమబ్బులు కమ్మి ఉరుములతో కూడిన భారీవర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. శనగ, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.
సత్తెనపల్లి: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే దశలో నీటి పాలవుతుందని భావించిన రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. నియోజకవర్గంలోని సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లోని పలు గ్రామాల్లో మిరపకాయల కల్లాలను రైతులు ఏర్పాటు చేశారు. ఆ పంటను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
రొంపిచర్ల: మండలంలో అకాల వర్షం మొక్కజొన్న, మిర్చి రైతులను ఆందోళనకు గురిచేసింది. కల్లాలలో ఆరబోసి ఉన్న మొక్కజొన్నలను, ఎండబోసిన మిర్చిని కుప్పలుగా చేసి వర్షానికి తడవకుండా టార్పలిన్ పట్టలను కప్పేశారు. అక్కడక్కడ మొక్కజొన్న పైరు నేలవాలిందని రైతులు తెలిపారు.
గాలులకు కూలిన కమ్యూనికేషన్ టవర్
పిడుగుపాటుకు మహి ళ మృతి
నూజెండ్ల : కురిచేడు మండలం పడమర వీరాయపాలెం, చౌడేశ్వరి కాలనీకి చెందిన కాటూరి సుబ్బరత్నం (51) మిరపకాయలు కోసే పనుల నిమిత్తం నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో ఆటో వద్దకు వస్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమెకు భర్త, కుమార్తెలు ఉన్నారు.


