కాలువలో పడి వలస కూలీ మృతి
కొల్లూరు: కాలువలో పడి వలస కూలీ మృత్యువాత చెందిన సంఘటన కొల్లూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం బెల్లవరంకు చెందిన అన్నీక కొండబాబు ఉపాధి నిమిత్తం మండలంలోని పెసర్లంకలో ఇటుక పరిశ్రమలో పనిచేసేందుకు తన బంధువులతో కలసి ఇటీవల వచ్చాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటుక పరిశ్రమలో కూలీలు పనులు నిలిపివేశారు. పనులు లేని కారణంగా కొల్లూరు వచ్చిన కొండబాబు, స్థానిక దుకాణం వద్ద మద్యం తాగాడు. మద్యం మత్తులో తిరిగి తాను పనిచేయడానికి వచ్చిన ఇటుక పరిశ్రమ ప్రాంతానికి చేరుకోలేకపోయిన అతను సమీపంలో ఉన్న దోనేపూడి చానల్ వద్ద మత్తులో పడిపోయాడు. గురువారం రాత్రి సమయంలో మత్తు నుంచి కొంత మేర తేరుకున్న కొండబాబు కాలువ వంతెన గోడపై కూర్చుని ఉండగా అదుపు కోల్పోయి కాలువలోకి పడిపోయాడు. కాలువలో నీరు స్వల్పంగా ఉండటంతో బండరాళ్లపై పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కొండబాబు కాలువలో పడిపోవడాన్ని గమనించిన ఓ వృద్ధుడు ఎవరో కాలువలో పడిపోయనట్లు స్థానికులకు తెలపడంతో వారు అప్రమత్తమై పరిశీలించే సరికి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మరణించాడు. వలస కూలీ మృతి సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు సోదరుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ పి. కోటేశ్వరరావు తెలిపారు.


