నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన
నరసరావుపేట: పిన్నెల్లిలో వైఎస్సార్ సీపీ దళిత కార్యకర్త హత్యకు నిరసనగా పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేటలో శనివారం ఉదయం 10గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎస్‌సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా ఎస్‌సీ సెల్ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, దళిత నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో ప్రముఖ సాహితీవేత్త, మహిళా పక్షపాతి త్రిపురనేని రామస్వామి చౌదరికి ఘనంగా నివాళులు అర్పించారు. త్రిపురనేని జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశాల మేరకు రెవెన్యూ, పర్యాటక శాఖల ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామస్వామి సాహిత్యాలు, స్వాతంత్య్ర ఉద్యమం మీద ప్రభావం, మహిళల పట్ల గౌరవభావం, కుల వివక్ష, అంటరానితనం, అందవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమాలు, చేసిన పోరాటాల గురించి తలుచుకున్నారు.
చెరుకుపల్లి: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొని ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం చందోలు నుంచి పిట్లవానిపాలెం వెళ్లే రహదారిలో రాంబొట్ల పాలెం పంచాయతీ పరిధిలో గురువారం ఒంటి గంట సమయంలో నిజాంపట్నం గ్రామానికి చెందిన ఏమినేని రామకృష్ణ(42) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై నిజాంపట్నం వెళుతుండగా అదే మార్గంలో చందోలు గ్రామానికి చెందిన కంకణాల శ్రీను అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చి రామకృష్ణ వాహనాన్ని ఢీ కొనటంతో తీవ్ర గాయాలైన రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై టి.అనిల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రేపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన


